తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉందని పైపైకి చెప్పుకోవడానికి కనిపిస్తున్నా… అంతర్గతంగా ఉండాల్సిన లుకలుకలు చాలానే ఉన్నాయనేది ఎప్పట్నుంచో వినిపిస్తున్నదే. వీటన్నింటికీ మూలం ఫిరాయింపుల్ని ప్రోత్సహించడమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, భవిష్యత్తులో అన్నీ సర్దుకుంటాయీ.. పార్టీ పటిష్టత ఇది తప్పదు అన్నట్టుగా ఫిరాయింపుల్ని చంద్రబాబు సమర్థించుకుంటూ వచ్చారు. కానీ, సీనియర్లలో ఉండాల్సిన అసంతృప్తులు అలానే ఉన్నాయి. నియోజక వర్గాల సంఖ్య పెరుగుతుంది కాబట్టి, ఈ అసంతృప్తులన్నీ సెట్ అయిపోతాయని అనుకుంటూ వచ్చారు. కానీ, నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడటంతో… టీడీపీ అధినాయకత్వానికి కొంత మేర జ్ఞానోదయం కలిగినట్టుంది! అందుకే, ఇప్పుడు పార్టీలో అసంతృప్తుల నాయకులపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
ఇకపై, జిల్లాల వారీగా పార్టీ వర్గాల్లో ఉన్న సమస్యలపై దృష్టి పెట్టబోతున్నట్టు టీడీపీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా టీడీపీలో ఉన్న వర్గ విభేదాలు ఏ స్థాయిలో ఉన్నాయో బట్టబయలు అయ్యాయి. తనకు టిక్కెట్టు దక్కదని తెలిసిన మరుక్షణమే శిల్పా మోహన్ రెడ్డి పార్టీ ఫిరాయించేశారు. ఇదే పరిస్థితి మున్ముందు రాకూడదన్న ఉద్దేశంతో… ముందుగా పార్టీ సీనియర్ నాయకుడైన రామసుబ్బారెడ్డితో చంద్రబాబు సమావేశం అయ్యారు! జమ్మలమడుగుకు చెందిన ఈ సీనియర్ నేత ఈ మధ్య తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ప్రతిపక్షం నుంచి జంప్ జిలానీగా వచ్చిన ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తికి గురైంది. అయితే, ఇదే సందర్భంలో ఆ వర్గాన్ని సంతృప్తి పరిచేందుకు గవర్నర్ కోటాలో టిక్కెట్ ఇస్తానంటూ రామసుబ్బారెడ్డికి చంద్రబాబు మాటిచ్చారు. అయితే, ఆ హామీ ఎప్పటికి నెరవేరుతుందో అనే నిర్వేదాన్ని సుబ్బారెడ్డి ఈ మధ్య వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు రంగంలోకి దిగి, అమరావతిలో ఆయనతో భేటీ అయ్యారు.
తన వర్గానికి ఏదో ఒక పదవి ఇవ్వకపోతే కార్యకర్తలు సహించేలా లేరని చంద్రబాబుకు రామసుబ్బారెడ్డి ఈ భేటీలో చెప్పినట్టు తెలుస్తోంది. కార్యకర్తలు నిలదీస్తుంటే మాట్లాడలేకపోతున్నాననీ, ఇదే పరిస్థితి ఇంకొన్నాళ్లు కొనసాగితే పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని కూడా అన్నారట. దీనిపై స్పందించిన చంద్రబాబు, త్వరలోనే న్యాయం చేస్తాననీ, కాస్త ఓపిగ్గా ఉండాలంటూ ఆయనతో చెప్పినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్.. పార్టీ ఆంధ్రా అధ్యక్షుడు కళా వెంకట్రావులతో కూడా రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. ఇదే క్రమంలో మరికొంతమంది సీనియర్లతో చంద్రబాబు భేటీ కార్యక్రమాలు ఉంటాయని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. శిల్పా మోహన్ రెడ్డి జంపింగ్ లాంటి సీన్ రిపీట్ కాకూడదనే పట్టుదలతో చంద్రబాబు ఉన్నారట! చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే. వైకాపా నుంచి ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తున్నప్పుడే.. భవిష్యత్తులో ఇలాంటి పంచాయితీలు ఉంటాయని తెలీదా..!