పవన్ కల్యాణ్ పై ఆంధ్రజ్యోతి అభిప్రాయంలోకి వెళ్లే ముందు.. ఓ సర్వే గురించి చెప్పుకుందాం. వీడీపీ అసోసియేట్స్ సర్వే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది! ఈ సర్వే ప్రకారం ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే తెలుగుదేశం మరోసారి అధికారంలోకి రావడం అని ఈ సర్వే చెప్పింది. ఏపీలో 47 శాతం ఓట్లు టీడీపీకి వస్తాయనీ, వైకాపాకి కూడా 40 శాతం ఓట్లు గ్యారంటీ అని పీడీపీ సర్వే తేల్చింది. ఇక, ఏపీ రాజకీయాల్లో అత్యంత కీలకం అవుతుందని భావిస్తున్న పవన్ కల్యాణ్ జనసేన పార్టీకి కేవలం 3 శాతం ఓట్లే వస్తాయట! కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ కోలుకోలేదనీ ఆ పార్టీకి కూడా 3 శాతం ఓట్లే వచ్చే అవకాశం ఉందని సదరు సర్వే స్పష్టం చేసింది. అంటే, కాంగ్రెస్, జనసేనలు ఎలాంటి ప్రభావం చూపవు అనేది సర్వే తేల్చిన ఫలితం.
ఈ సర్వే ప్రకారం చూసుకుంటే టీడీపీ, వైకాపాల మధ్య 7 శాతం ఓట్ల తేడా. అంటే, ఇప్పట్నుంచీ జగన్ కాస్త తీవ్రంగా ప్రయత్నిస్తే.. అధికారం అందుకోవచ్చు అనే కోణంలో వైకాపా శ్రేణులు ఈ సర్వేను విశ్లేషించుకుంటున్నట్టు సమాచారం. పొత్తుపై కాస్త శ్రద్ధ పెడితే వచ్చే ఎన్నికల్లో టీడీపీని ఓడించడం ఈజీ అనీ, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా చూసుకుంటే సరిపోతుందని వారు చర్చించుకున్నారట! అయితే, ఈ పొత్తుల విషయంలోనే అసలు చర్చ ఉంది! వీలైతే పవన్ కల్యాణ్ తో కూడా పొత్తు పెట్టుకుంటే బాగుంటుందని పార్టీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈ మధ్యే చెప్పారనీ వైకాపా వర్గాలు అంటున్నాయి. కానీ, ఇప్పుడీ వీడీపీ సర్వే ప్రకారం చూసుకుంటే పవన్ ప్రభావం పెద్దగా ఉండదనే కదా! ఇప్పుడు ఆంధ్రజ్యోతి టాపిక్ కి వద్దాం.
వారి విశ్లేషణ ఎలా ఉందంటే… పవన్ తో పొత్తు కోసం జగన్ వెంపర్లాడుతున్నట్టుగా ఉంది! ‘కొత్త పలుకు’లో ఆ పత్రిక అభిప్రాయం ఏంటంటే… జగన్ తో చేతులు కలపడానికి సీపీఐ సిద్ధంగా లేదూ, సీపీఎం కలిసి వెళ్లే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నారు. అలాగే, అధికారం కోసం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన జనసేనకూ.. వైకాపాకీ పొంతన కుదిరే ఛాన్సులు లేదని రాశారు. సంప్రదాయ రాజకీయాలకు భిన్నంగా వ్యవహరిస్తున్న పవన్ కల్యాణ్, అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్ తో చేతులు కలిపేందుకు ఇష్టపడకపోవచ్చు అనే అభిప్రాయాన్ని ఆ పత్రిక వ్యక్తం చేసింది! అంటే, పవన్ మద్దతు కోసం జగన్ పరుగులు తీస్తున్నట్టు, కాదూ కుదరదూ అంటూ పవన్ మొండికేస్తున్నట్టుంది!
ఇక్కడ రెండు విషయాలు జాగ్రత్తగా గమనించాలి! వీడీపీ సర్వేలో జనసేనకు 3 శాతమే ఓట్లు వస్తాయని వారే రాస్తారు. అంటే, ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తుందనీ, పవన్ ప్రభావం ఉండదనేది సర్వే లెక్క కదా! అలాంటప్పుడు ఆయనతో పొత్తు కోసం జగన్ వెంటపడుతున్నట్టూ వారే ఎలా చెబుతారు? ఇక, రెండో విషయం.. అధికారం కోసం పవన్ కల్యాణ్ వెంపర్లాడటం లేదూ, ఏదో ప్రజాసేవ పేరుతో ‘విభిన్న’ రాజకీయాలు చేస్తున్నారనీ వారే విశ్లేషిస్తారు. రాజకీయాల్లో విభిన్నత అంటే ఏంటీ..? జనసేన కూడా వచ్చే ఎన్నికల్లో పోటీకి సిద్ధమంటోంది కదా! ఇది విభిన్నత ఎలా అవుతుంది..?
బాటమ్ లైన్ వెరీ సింపుల్.. పవన్ వారికి కావాలీ, కానీ, జగన్ తో పవన్ కలవొద్దు! పవన్ వారికి కావాలి.. కానీ, పవన్ సోలోగా కీలక రాజకీయ శక్తి కావొద్దు. తరువాత మాట కూడా ఓపెన్ గా చెప్పేసుకుందాం… పవన్ వారికి కావాలీ, వారు కావాలనుకున్న వారితో కలిసి కదలాలి. ఇదేగా ఈ కొత్త పలుకుల సారాంశం!