చిరంజీవి సినీ పరిశ్రమ తిరిగి వస్తే అయన 150 సినిమాకి దర్శకత్వం వహిద్దామని చాలా మంది దర్శకులు ఆశ పడ్డారు. కానీ చివరికి ఆ అవకాశం దర్శకుడు పూరీ జగన్నాథ్ కి దక్కింది. కానీ అదే సమయంలో రాజమౌళి తీసిన బాహుబలి విడుదల కావడంతో “అంతకంటే గొప్ప సినిమా తీయకపోతే చిరంజీవి ఇమేజ్ దెబ్బ తింటుంది. కనుక ఆయన రాజమౌళితోనే సినిమా తీస్తే బాగుంటుంది” అని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒకటే ట్వీట్లు. ఒక దర్శకుడు మరొక దర్శకుడు గురించి ఆవిధంగా చులకనగా మాట్లాడటాన్ని సినీ పరిశ్రమలో అందరూ తప్పు పడుతున్నారు. మరి ఆయన వేసిన ట్వీట్ల ప్రభావమో లేక దర్శకుడు పూరీ జగన్నాథ్ చెప్పిన సినిమా రెండవ భాగం కధ నిజంగానే సంతృప్తికరంగా లేదో తెలియదు కానీ చిరంజీవి పూరీని పక్కనపెట్టేసారు.
“మంచి కధతో వస్తే కొత్త దర్శకులతోనయినా తను సినిమా చేయడానికి సిద్దం” అని చిరంజీవి ప్రకటించారు. పూరీ వంటి ప్రముఖ దర్శకుడు చెప్పిన కధ నచ్చలేదని ఆయనని పక్కన బెట్టి కొత్త దర్శకులతోనయినా తను చేయడానికి సిద్దం అని చిరంజీవి ప్రకటించడం ఒకవిధంగా పూరీకి చాలా అవమానకరమే. అందుకు ఆయన చాలా బాధపడ్డారు. ఇటీవల ఆయన తీసిన ‘జ్యోతీ లక్ష్మి’ సినిమా ఫ్లాప్ అవడం ఆయనకు మరో ఎదురు దెబ్బ. అందుకే ఈసారి ఆయన ఒక మీడియం రేంజ్ హీరోని పెట్టి లో బడ్జెట్ లో మంచి సినిమా తీసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కేవలం రెండు నెలల్లోనే సినిమా షూటింగ్ పూర్తి చేసి విడుదల చేయాలనుకొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆ సినిమా వివరాలు ప్రకటిస్తారు.