తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ప్రముఖ రాజకీయ పార్టీలన్నింటికీ ఒకే లక్ష్యం ఉంది! అధికారం, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అందరినీ ఏకతాటిపైన తీసుకొచ్చిన అంశం అది. అదేనండీ.. అసెంబ్లీ సీట్లు పెంపకం! ఆంధ్రా, తెలంగాణల్లో అధికార పార్టీలు ఇష్టం వచ్చినట్టు ఫిరాయింపుల్ని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. చట్ట విరుద్ధం అని తెలిసినా కూడా జంప్ జిలానీలను ప్రోత్సహిస్తూ వచ్చారు. అయితే, కొత్తగా చేరిన నేతలకు అవకాశాలు ఇవ్వాలంటే నియోజక వర్గాల సంఖ్య పెరగాలి. నిజానికి, ఫిరాయింపుల ప్రోత్సాహం వెనక చంద్రబాబు, కేసీఆర్ ల ధీమా కూడా ఇదే. ఇదే అంశమై ఇటీవల వేర్వేరుగా ఢిల్లీకి వెళ్లిన ఇద్దరు చంద్రులూ ప్రధాని మోడీతో ప్రస్థావించిన సందర్భాలూ ఉన్నాయి. వచ్చే వర్షాకాల సమావేశాల్లోనే అసెంబ్లీ సీట్ల పెంపు అంశం ఒక కొలీక్కి వచ్చేయాలనీ, ఇంకా ఆలస్యమైతే నియోజక వర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యేందుకు చాలా సమయం పట్టేస్తుందని కూడా ఇద్దరు చంద్రులూ ఢిల్లీ పెద్దలతో కోరినట్టు కూడా కథనాలు వచ్చాయి! అయితే, ఇప్పుడు కేంద్రం దగ్గర కూడా ఇదే అంశంపై కదలిక వచ్చినట్టు సమాచారం.
రాష్ట్రపతి ఎన్నిక తరువాత ప్రధాని నరేంద్ర మోడీ సర్కారు అసెంబ్లీ సీట్ల పెంపకంపైనే దృష్టి పెట్టేలా కనిపిస్తోంది. ఈ సంఖ్య పెంచుకునేందుకు రాజ్యాంగ సవరణ సరిపోతుందని మొదట్నుంచీ వినిపిస్తున్నదే. దీనికి అనుగుణంగా సవరణ చేసుకోవచ్చని కేంద్ర న్యాయ శాఖ సిఫార్సు చేసిందని చెబుతున్నారు. కేంద్ర హోం శాఖకు పంపిన నివేదికలో ఇదే అంశాన్ని న్యాయ శాఖ పేర్కొందని అంటున్నారు. అయితే, ఈ సవరణ కోసం కనీసం యాభై శాతం అసెంబ్లీలు తీర్మానం చేయాల్సి ఉంటుందని గతంలో అనుకున్నారు. కానీ, ఇప్పుడు పార్లమెంటులో బిల్ పాస్ చేస్తే సరిపోతుందని కూడా న్యాయశాఖ చెప్పినట్టు కథనాలు వస్తున్నాయి. అయితే, దీనిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇంకా దృష్టి సారించాల్సి ఉందనీ, ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే ప్రాసెస్ మొదలైపోతుందని కూడా కొంతమంది అభిప్రాయపడుతున్నారు.
తెలుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల లక్ష్యం త్వరలోనే నెరవేరుతుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. అంటే, రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి కేసీఆర్ బేషరతుగా మద్దతు ఎందుకిచ్చారో… ఎన్డీయే భాగస్వామ్య పక్షం కాకపోయినా తెరాస అంత హడావుడి ఎందుకు చేస్తోందో ఇప్పుడు అర్థమౌతోంది. వైకాపాకి సానుకూల సంకేతాలు ఇస్తున్నా కూడా భాజపాను పల్లెత్తి మాట అనకుండా టీడీపీ వ్యూహాత్మక మౌనంతో ఎందుకు ఉంటోందో ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు! ఓరకంగా వైకాపా కూడా నియోజక వర్గాల సంఖ్య పెంపుదల కోసం ఎదురుచూస్తున్న పార్టీనే. ఇటీవలే విజయవాడకు చెందిన ఓ ప్రముఖ కాంగ్రెస్ నేతను వైకాపాలోకి ఆహ్వానించిన సందర్భంగా… అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి కాబట్టి, కొత్తవారిని పార్టీలోకి ఆహ్వానించొచ్చు అనే అభిప్రాయం ఆ పార్టీ వర్గాలూ బలంగానే వినిపించింది. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీల అవసరాలను కేంద్రం గుర్తించి కాబట్టే… రాష్ట్రపతి ఎన్నికల్లో ఆ రేంజిలో మద్దతును ఈజీగా కూడగట్టగలిగిందని చెప్పొచ్చు.