తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5
నాని సినిమా అనగానే ఒక మంచి కథని ఊహిస్తారు ప్రేక్షకులు. ఆ తర్వాత ఆయన మార్క్ వినోదం. ఈ రెండు విషయాల్లో ప్రేక్షకుల్ని సంతృప్తి పరిచిన ప్రతి సినిమా బాక్సాఫీసు దగ్గర విజయ దుందుబి మోగించింది. ఆ విషయాన్ని పక్కాగా దృష్టిలో ఉంచుకొనే కథల్ని ఎంపిక చేసుకొంటున్నాడు నాని. ఇటీవల వరుస విజయాలతో దూసుకెళుతున్నాడాయన. అందుకే నాని సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. మరి ఆ అంచనాలకి తగ్గట్టుగానే తాజా చిత్రం `నిన్ను కోరి` ఉందా? ఈ చిత్రంతో నాని మరో విజయాన్ని తన అకౌంట్లో వేసుకున్నట్టేనా?
* కథ
ఉమామహేశ్వర్ రావు అలియాస్ ఉమ (నాని) పీహెచ్డీ విద్యార్థి. అనుకోకుండా పల్లవి (నివేదా)తో పరిచయమవుతుంది. ఆ తర్వాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఆ తర్వాత పల్లవి ఇంట్లోనే పెంట్ హౌస్ లో అద్దెకు దిగుతాడు ఉమ. వాళ్ల మధ్య బంధం మరింత బలపడుతుంది. ఇంట్లోవాళ్లు తనకి పెళ్లి చేయాలని చూస్తుండడంతో పల్లవి లేచిపోదామని ఉమపై ఒత్తిడి పెంచుతుంది. కానీ జీవితంలో స్థిరపడలేనివాడు అలా అమ్మాయిని తీసుకునివెళ్లడం భావ్యం కాదని భావించి, పీహెచ్డీ తర్వాత పెళ్లి చేసుకొందామని నచ్చజెప్పి డిల్లీకి వెళ్లిపోతాడు. ఇంతలో పల్లవి తన పేరెంట్స్ చూసిన అరుణ్ (ఆది పినిశెట్టి)ని పెళ్లి చేసుకొని ఫారిన్ లో సెటిల్ అవుతుంది. అది తెలిసిన ఉమ డిప్రెషన్లోకి వెళ్లిపోతాడు. అమెరికాలో ఉద్యోగం వచ్చినా.. మనసుపెట్టలేక అక్కడ ఉద్యోగం మానేసి మద్యానికి బానిసవుతాడు. ఎప్పటికైనా తనకోసం తిరిగొస్తుందని భావిస్తుంటాడు. మరి అరుణ్‌తో అన్యోన్యంగా ఉంటున్న పల్లవి ఉమని వెతుక్కుంటూ ఎందుకు వెళ్లింది? ఉమ, పల్లవి ఒక్కటవుతారా లేక అరుణ్తోనే వైవాహిక బంధం కొనసాగించిందా? తదితర విషయాల్ని తెరపై చూడాల్సిందే.
* విశ్లేషణ
ప్రేమంటే పెళ్లికి ముందే కాదు, ఆ తర్వాత కూడా అని చాటి చెప్పే చిత్రమిది. ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా ఎంతో సెన్సిటివిటీతో సాగే ఈ సినిమాని దర్శకుడు అంతే మెచ్చూర్డ్‌గా తెరకెక్కించాడు. తొలి సినిమా తీస్తున్న దర్శకుడికి అంత క్లారిటీ అంటే ఆయనలో విషయమున్నట్టే. కాకపోతే నాని మార్క్ వినోదంతో సినిమా సాగకపోవడం, ఈ కథ చాలా సినిమాల్ని పోలివుండడం ప్రేక్షకుడికి అంతగా మింగుడుపడదు. ఆ రెండూ గుర్తుకు రాకపోతే మాత్రం ప్రేక్షకుడు హాయిగా సినిమాని ఆస్వాదించొచ్చు. సినిమా తొలి సగభాగంలో వైజాగ్‌లో జరిగే ప్రేమకథ నాని గత సినిమాల్లాగే సందడి సందడిగా ఉంటుంది. ఆ తర్వాత కథ అమెరికాకి షిఫ్ట్ అవుతుంది. ఆ నేపథ్యంలో వచ్చే సన్నివేశాలు మాత్రం పూర్తి డిఫరెంట్‌గా, నాని ఇదివరకటి సినిమాలకి భిన్నంగా సాగుతున్నట్టు అనిపిస్తాయి. కథలో అక్కడక్కడ లాజిక్ లేని విషయాలు, అదెలా సాధ్యం అనిపించే విషయాలు కనిపిస్తూనే ఉంటాయి. కానీ వాటన్నింటిపైనా క్లైమాక్స్‌లో ఓ క్లారిటీ వచ్చేలా చేశాడు దర్శకుడు. పెళ్లయ్యాక తన భార్య ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ మన ఇంట్లో ఓ పది రోజులు ఉంటాడంటే ఏ భర్తయినా ఒప్పుకొంటాడా? కానీ ఈ సినిమాలో అదే జరుగుతుంది. ఆ నేపథ్యంలో సన్నివేశాలు వచ్చినప్పుడంతా సినిమా అసహజంగా సాగుతున్నట్టు అనిపిస్తుంది. కానీ క్లైమాక్స్‌లో దానిపై ఓ క్లారిటీ ఇవ్వడంతో ప్రేక్షకుడి అనుమానాలన్నీ పటాపంచలవుతాయి. నాని ఈ కథని ఎంచుకొని చేశాడంటే ఆయనకి కథలంటే ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు. వరుస విజయాలతో ఉన్న నాని ఇప్పుడు తెరపై ఎంతైనా హీరోయిజం చూపించొచ్చు. కానీ దానికి ఆస్కారమే లేకుండా, అసలు నాని హీరోనా కాదా అనిపించేలా సాగే ఈ కథలో ఆయన నటించాడంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సినిమాకి ప్రాణం పోశాయి.
* నటీనటుల ప్రతిభ
నాని సినిమా అనగానే నటన పరంగా ఆయనకే ఎక్కువ మార్కులు లభిస్తుంటాయి. కానీ ఈ సినిమాలో మాత్రం నివేదా అందరికంటే ఎక్కువగా ఆకట్టుకుంది. అటు అందంగానూ, ఇటు అభినయంతోనూ అలరిస్తుందామె. భావోద్వేగాల్లోనూ నివేదాకి తిరుగులేదనిపిస్తుంది. ఇక నాని అంటే ఇందులో మూడు రకాలుగా కనిపించాడు. ద్వితీయార్థంలో ఆయన పాత్రలో కొన్ని నెగిటివ్ షేడ్స్ కూడా కనిపిస్తుంటాయి. చిన్న చిన్న ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చాలా సన్నివేశాల్ని రక్తికట్టించాడు నాని. ఇక ఆది కూడా ప్రీ క్లైమాక్స్‌లో చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర మరీ ఇంత చప్పగా సాగుతోందేంటి అనుకొన్న సమయంలోనే తన నటనతో మెప్పించాడు. మురళి శర్మ, పృథ్వి, సుదర్శన్, తనికెళ్ల భరణి తదితరులు వాళ్ల వాళ్ల పాత్రల పరిధి మేరకు సందడి చేస్తారు.
* సాంకేతిక వర్గం
టెక్నికల్‌గా కూడా సౌండ్‌గా ఉంది సినిమా. గోపీ సుందర్ సంగీతం, కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ చాలా బాగున్నాయి. వైజాగ్ అందాలతో పాటు, అమెరికాని కూడా చాలా బాగా చూపించాడు కార్తీక్. గోపీసుందర్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. దర్శకుడు శివ నిర్వాణ కథని అల్లుకున్న విధానం, ఆయన రాసుకున్న మాటలతోపాటు, వాటిని తెరపైకి తీసుకొచ్చిన విధానం కూడా చాలా బాగుంది. కథని నమ్మి దానికి ఏం కావాలో అది చేశాడు నిర్మాత.
* ఫైనల్ టచ్ : ఓ చిన్న ఛేంజ్ అన్నట్టుగా నాని ఈసారి ఎమోషన్స్‌కి ప్రాధాన్యమిస్తూ చేసిన ప్రేమకథ.. నిన్ను కోరి!
తెలుగు360.కామ్ రేటింగ్ : 3.25/5