గత కొద్ది వారాలుగా జరుగుతున్న పరిణామాలు పాలకపక్షమైన టిడిపికి ఇరకాటంగా మారితే శాసనసభలో ఏకైక ప్రతిపక్షంగా వున్న వైసీపీకి కొత్త వూపు నిస్తున్నతీరు గుంటూరులో జరుగుతున్న ప్లీనరీలో కనిపిస్తుంది. గతంలో తమపై టిడిపి ఏ కోణంలో దాడి చేసిందే ఇప్పుడు అదే పాచిక వేయాలని వైసీపీ వ్యూహం తీసుకుంది. టిడిపి అప్పటి ఇతర ప్రతిపక్షాలు కలసి వైఎస్ రాజశేఖరరెడ్డిని రాజా అఫ్ కరప్షన్ అంటే వైసీపీ ఎంపరర్ ఆఫ్ కరప్షన్ పుస్తకం విడుదల చేసింది. వారు లక్ష కోట్లు అవినీతి అంటే వీరు మూడు లక్షల కోట్లు అన్నారు. ఈ పుస్తకం ముప్పై వేల ప్రతులు వేశామని ప్రజల్లోకి విస్తారంగా తీసుకెళ్లాలని జగన్ పిలుపినిచ్చారు. అంటే ఈ అంశంపై వైసీపీ బాగా కేంద్రీకరిస్తుందన్నమాట. ఎంఎల్ఎ రోజా జగన్ను అసెంబ్లీ టైగర్ ఆంధ్ర ప్రదేశ్ ఫ్యూచర్ అని వర్ణించడం కూడా వారి కొత్త నినాదమనుకోవాలి. అయితే అసెంబ్లీ టైగర్ అన్న మాట పెద్ద శక్తివంతమైంది కాదు. ఇక ప్లీనరీ ప్రసంగాల పొడుగునా జగన్ ముఖ్యమంత్రి కావాలన్న మాట ప్రతిధ్వనించడం చూస్తే పదే పదే ఆ మాట అనడం ద్వారా ఆత్మ విశ్వాసం పెంచాలనే వ్యూహం అనుకోవాలి. ఇక తర్కమద్దమైన ప్రసంగాలకు పేరు పడిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు గత సారి వైసీపీ ఓడిపోయిందన్న వాదననే తోసి పుచ్చారు. అధికారంలో లేని వాళ్లం ఓడిపోవడం ఏమిటని 67 స్థానాలు తెచ్చుకోవడం గొప్ప విషయమని ఆయన అన్న దానిలో అర్థముంది. అయితే అధికారం చేజారిపోయిందన్న నిరుత్సాహం రావడానికి జగన్తో మొదలు పెట్టి ఆ పార్టీ నేతలంతా కారకులే. ఆ కారణంగానే తర్వాత కూడా ప్రజా సమస్యలపై ఉద్యమాలు ఆందోళనలు చేయడంలోనూ కొంత నీరసం చూపించారు. జగన్ ఇమేజి తప్ప ఇవన్నీ అవసరంలేనివన్న అభిప్రాయం చూపించారు. జగన్ కూడా ప్రతిదానికి మేము వచ్చాక.. నేను ముఖ్యమంత్రినైతే అంటూ ఆ వాతావరణమే కొనసాగించారు. ఇది సరైన పద్ధతి కాదని ప్రశాంత కిశోర్ కూడా వ్యాఖ్యానించినట్టు చెబుతున్నారు. మరి ఈ ప్లీనరీ ఏ దిశలో వెళుతుంది ? ఏం తుది నిర్ణయాలు తీసుకుంటుంది? రేపు గాని తేలదు.