సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు బైర్రాజు రామలింగ రాజు రెండో కోడలు సంధ్యా రాజు వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. రామ్ కో సిస్టమ్స్ వ్యవస్థాపకుడు వెంకట్రామ రాజు కూతురైన సంధ్యారాజుకు కూచిపూడిలో ప్రవేశం ఉంది. నాట్యం అంటే ఆమెకు ప్రాణం. కాల్ హెల్త్ అనే వ్యాపార సంస్థలో ఆమె కో ప్రమోటర్ గా వ్యాపార ప్రపంచంలోకి ఎంట్రీ ఇచ్చారు. పేషెంటు ఇంటి దగ్గరికే ఆరోగ్య సేవలను చేర్చడం ఈ సరికొత్త వ్యాపార కాన్సెప్ట్ ఉద్దేశం. ఈ కంపెనీకి హరి తాళపల్లి సి ఇ ఒ గా వ్యవహరిస్తారు. ఈనెల చివరి వారంలో హైదరాబాదులో ఈ కంపెనీ సేవలు మొదలవుతాయి. ఆ తర్వాత ఏడాదిలో విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ నగరాలకు విస్తరిస్తారు. ఈ కంపెనీ ప్రారంభ పెట్టుబడి 60 కోట్లని హరి తెలిపారు.
ఈ సరికొత్త కాన్సెప్ట్ హెల్త్ కేర్ పట్ల సంధ్య ఎంతో ఉత్సుకతతో ఉన్నారని హరి తెలిపారు. మూడేళ్ల క్రితం కూచిపూడి ప్రదర్శన ఇస్తుండగా ప్రమాదవశాత్తు ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది. ఆ సమయంలో అందుబాటులో వైద్య సేవలు ఉంటే బాగుంటుందని భావించారు. రోగి ఇంటి వద్దకే వైద్యసేవలను అందించడం అనేది నగరాల్లో మంచి ఆదరణ పొందుతుందని సంధ్య, ఇతర భాగస్వాములు భావిస్తున్నారు. రామలింగరాజు ఆర్థిక నేరాల కేసులో జైలు శిక్షకు గురైన తర్వాత ఆయన కుటుంబం ఎంతో కుంగిపోయింది. ఇప్పుడు కోడలు ధైర్యం కూడగట్టుకుని వ్యాపార రంగంలోకి ప్రవేశిస్తున్నారు. ఆమె ఇందులో గొప్పగా రాణిస్తారని శ్రేయోభిలాషులు నమ్మకంతో ఉన్నారు.