వైఎస్‌ఆర్‌సిపి ప్లీనరీలో వ్యూహ సలహాదారు ప్రశాంత కిశోర్‌ను పరిచయం చేయడమే కాదు, ఆ సలహాల అమలు కూడా ప్రారంభమైనట్టు కనిపిస్తుంది. మూడు రోజుల కిందట తెలుగు360లో చెప్పుకున్నట్టు పాదయాత్ర ప్రణాళికను జగన్ ప్రకటించడం అందుకో ఉదాహరణ. గతంలోనూ ఆయన ఓదార్పు యాత్రలు చేశారు గాని ఇప్పుడు చేసేవి ఒక విధంగా ఆత్మ విశ్వాస కల్పన యాత్రలన్నమాట. ఈ వూపులో ఏకంగా తిరుపతి వెంకన్న సన్నిధికి కాలినడక యాత్రను కూడా కలపడం విశేషం. సోదరి షర్మిలకు తల్లి విజయమ్మకు ప్రాధాన్యతివ్వడం, పిసిసి మాజీ అద్యక్షుడు బొత్స సత్యనారాయణను ఆలింగనం చేసుకోవడం వంటివన్నీ జగన్ వైఖరిలో మార్పు వచ్చిందన్న సంకేతం ఇవ్వడానికి ఉద్దేశించినవే. ఇది కూడా ప్రశాంత కిశోర్ సలహాలలో ఒకటి. ఆమోద యోగ్యత పెంచుకోవడం, అందరినీ కలుపుకోవడం. ప్రసంగాలలో పెద్ద కొత్తదనం లేదు గాని నమ్మకం కలిగించాలనే ప్రయత్నం ప్రస్ఫుటంగా వుంది. అయితే ముఖ్యమంత్రి కావాలన్నది తన బలమైన కోర్కె అని జగన్ చెప్పడంపై ఎవరి వ్యాఖ్యానం వారు చేసే అవకాశముంది. ఇక వచ్చాక ముప్పై ఏళ్లు వుండాలనుకోవడం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు తాను జ్యోతిబాసులా పాతికేళ్లు పాలించాలనుకున్న సందర్భాన్నిగుర్తు చేస్తుంది. విమర్శలు ఏమైనా ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో ఏ మాజీ ముఖ్యమంత్రి కుమారుడు సాధించనంత పట్టును జగన్ సాధించగలిగారన్నది నిజం. అది కూడా ఆయన మరణానంతరం ఆయన పనిచేసిన పార్టీ అధిష్టానాన్ని ఎదిరించి ఆరోపణల్లో జైలు శిక్షలు విచారణలు ఎదుర్కొంటూ బలమైన శక్తిగా కొనసాగుతున్నారంటే ఒక సామాజిక రాజకీయ పునాది వుండటం వల్లనే సాధ్యమైంది. ఆ పునాది పెద్దగా చెదరిపోలేదని సర్వేలు ప్లీనరీ సంరంభం కూడా చెబుతున్నాయి. బిజెపికి దగ్గర కావడం అదనపు అంశం.దానిపై తెలుగుదేశంలో కొంత అ భద్రత బయిలు దేరింది. గనకనే అక్కడ సభ ముగియకుండానే అంతమంది మంత్రులు అన్ని వైపుల నుంచి విరుచుకుపడ్డారు. ప్రభుత్వంలో వున్న వారు ప్రతిపక్ష సదస్సుకు ఇంతటి ప్రాధాన్యత నివ్వడం అరుదైన విషయమే. ఇప్పటి వరకూ వైసీపీ నడిచిన తీరుకు ఇకపై వేసే అడుగులకు తేడా వుండొచ్చు. ఎన్నికలు జయాపజయాలుపై అప్పుడే జోస్యాలు అవసరం లేదు గాని వైఎస్‌ఆర్‌సిపీ బలంగానే సవాలు ఇవ్వబోతున్న మాట నిజం.