రానాపై నమ్మకాలు పెరిగిపోతున్నాయి. బాహుబలికి ముందే బాలీవుడ్‌లోనూ తొడగొట్టిన రానా… ఆ సినిమాతో అక్కడ స్టార్ అయిపోయాడు. ఆ ఎఫెక్ట్‌తోనే నేనే రాజు నేనే మంత్రి సినిమాని తమిళనాట కూడా భారీగా విడుదల చేయాలని ప్రయత్నిస్తున్నారు. రానాతో హిరణ్య కశ్యప తీయాలన్నది గుణ శేఖర్ తాజా ప్రయత్నం. గుణ శేఖర్ చెప్పిన లైన్ ఇటు రానాకీ అటు సురేష్‌బాబుకీ బాగా నచ్చేసిందట. ఈ సినిమాని అంతర్జాతీయ ప్రమాణాలతో తీయాలని గుణ ఫిక్సయ్యాడు. ఈ సినిమా కోసం దాదాపుగా రూ.100 కోట్లు ఖర్చు పెట్టాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో సురేష్ బాబు కూడా నిర్మాణ భాగస్వామిగా ఉంటాడని సమాచారం. మేకింగ్ విషయంలో గుణశేఖర్, ఆ సినిమా మార్కెటింగ్ విషయంలో సురేష్‌బాబు నిర్ణయాలు తీసుకొంటార్ట.
సురేష్ బాబు తెలివితేటలు అమోఘమనే చెప్పాలి. పెళ్లి చూపులు లాంటి చిన్న సినిమాని… పెద్ద సినిమా చేసేశాడు తన మార్కెటింగ్ స్ట్రాటజీతో. బాహుబలిని కరణ్‌జోహార్ బాలీవుడ్‌కి ఎలా మోసుకెళ్లాడో, హిరణ్య కశ్యపని అలా నెత్తిమీద ఎక్కించుకొనే నిర్మాత కోసం ఎదురుచూస్తోంది హిరణ్య కశ్యప టీమ్. ప్రస్తుతం రానా ఆ పనిలోనే నిమగ్నమయ్యాడని తెలుస్తోంది. రానాతో సినిమా, అందులోనూ గుణశేఖర్ దర్శకుడంటే రూ.100 కోట్లు వర్కవుట్ అవుతుందో లేదో చెప్పలేం గానీ…. మేం మరో పెద్ద సినిమా తీస్తున్నాం.. అని చాటింపు వేసుకోవడానికి మాత్రం ఈ అంకెలు బాగానే ఉపయోగపడతాయి. నేనే రాజు నేనే మంత్రి విడుదలయ్యాక… హిరణ్య కశ్యప పనులు మొదలవుతాయని తెలుస్తోంది.