ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకూ పాదయాత్ర చేస్తానంటూ ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో ఇదే అంశం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో అయితే.. జగన్ ఎలాంటి డ్రెస్ వేసుకుని పాదయాత్ర చేస్తారు, వైయస్ రాజశేఖర రెడ్డి మాదిరిగానే పంచె కట్టుకుని పాదయాత్ర చేస్తారా, ఆహార్యం ఏవిధంగా మారుతుందీ అనే అంశాలపై రకరకాల ఊహా చిత్రాలూ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. అదంతా పక్కన పెడితే… జగన్ పాదయాత్ర ఎదుర్కోబోతున్న సవాళ్లు ఏంటనేది అసలు చర్చ. గతంలో వైయస్ కూడా పాదయాత్ర చేసి అధికారంలోకి వచ్చిన మాట వాస్తవమే. కానీ, అప్పటి పరిస్థితులు వేరు. ఇప్పుడున్న రాజకీయ వాతావరణం వేరు.
నిజానికి, నాడు వైయస్ పాదయాత్ర ప్రారంభించే నాటికే తెలుగుదేశం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలై ఉంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వర్గాల్లో చంద్రబాబు పాలనపై బాగా అసంతృప్తి ఉండేది. అప్పటికే టీడీపీ అధికారంలోకి వచ్చి తొమ్మిదేళ్లు అయిపోయింది. పైగా, వైయస్ పాదయాత్రకు హైకమాండ్ నుంచి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ అందింది. దాంతో ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోయాయి. దాంతో వైయస్ జనంలోకి వెళ్లగానే ఆ స్పందన వచ్చింది. ప్రస్తుత పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. ప్రస్తుతం చంద్రబాబు సర్కారుపై ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇప్పుడే చెప్పలేం. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, రాజధాని నిర్మాణం, ఉపాధి కల్పన, ప్రాజెక్టుల నిర్మాణం వంటి అంశాలపై ప్రజల్లో కొంత అసంతృప్తి ఉంది. కానీ, చంద్రబాబు పాలనకు ఇంకా రెండేళ్లు సమయం ఉంది. ఇప్పటికిప్పుడే చంద్రబాబు ప్రభుత్వాన్ని గద్దెదించెయ్యాలన్న రేంజిలో ప్రజా వ్యతిరేకతేం లేదు. ఇదే లక్ష్యంతో జనంలోకి వెళ్తున్న జగన్ కు ఆ మూడ్ ను ప్రజల్లోకి ఇంజెక్ట్ చేయడం అనేది ఒక సవాల్.
తెలంగాణ విడిపోయిన తరువాత ఆంధ్రాను అభివృద్ధి చేయాలన్నా, కొత్త రాజధాని నిర్మించాలన్నా అది చంద్రబాబు నాయుడు వల్లనే సాధ్యం అనే అభిప్రాయం ప్రజల్లో నెలకొంది. అందుకే, టీడీపీకి అవకాశం ఇచ్చారు. అయితే, ఆ నమ్మకం ఇప్పటికీ ప్రజల్లో ఉందా లేదా అనే ప్రాథమిక అంచనాతో జగన్ యాత్రకు బయలుదేరాల్సి ఉంటుంది. ఒకవేళ తగ్గినట్టు వారు భావిస్తే.. జగన్ లో ఆ అభివృద్ధి కాముకుడిని ప్రజలు చూస్తున్నారా లేదా..? తనను తాను జగన్ ఆ రేంజిలో ఎలా ప్రెజెంట్ చేసుకోగలరు అనేది కూడా ముఖ్యం. అనుభవం చాలకపోయినా అభివృద్ధిపై అవగాహన జగన్ కు బాగానే ఉందన్న నమ్మకం ప్రజల్లో కలిగించడం మరో సవాల్.
ఇక, జగన్ పాదయాత్రకు అధికార పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు ఉండవా అనేది కూడా సవాలే. ఎందుకంటే, ఓపక్క కాపుల రిజర్వేషన్ల కోసం ముద్రగడ పద్మనాభం ఉద్యమించేందుకు సిద్ధమైన ప్రతీసారీ ముందుస్తు అనుమతులు లేవంటూ అడ్డుకుంటున్నారు. ఇప్పుడు కూడా కిర్లంపూడిలో 144 సెక్షన్ అమల్లో ఉన్న సంగతి తెలిసిందే! జగన్ పాదయాత్రకు కూడా ఇలాంటి అనుమతుల సమస్యే రావొచ్చు. అంతెందుకు.. ఆ మధ్య ప్రత్యేక హోదాపై గుంటూరులో సభ పెట్టేందుకు జగన్ ప్రయత్నిస్తే.. భద్రతా కారణాలంటూ అనుమతులు ఇవ్వని వైనం జగన్ కు అనుభవమే. ప్రభుత్వం నుంచి అనుమతుల రూపంలో పొంచి ఉన్న సవాల్ ఇది.
అన్నిటికీ మించి, జగన్ పై ఇప్పుడు ప్రజల్లోకి టీడీపీ తీసుకెళ్తున్న భావజాలం ఏంటంటే.. ‘జగన్ ది అధికార దాహం’! ఏంచేసైనా సరే అధికారంలోకి రావడమే జగన్ ధ్యేయమంటూ ఇప్పటికే టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. జగన్ కు రాజకీయాలు చేతకావడం లేదు కాబట్టే సలహాదారులను పెట్టుకున్నారనీ అంటున్నారు. వీటితోపాటు.. ఎన్నికలకు మరో రెండేళ్లు సమయం ఉంది. ఇప్పట్నుంచే పాదయాత్ర చేసి.. ప్రజల్లో ఓ మూమెంట్ తీసుకొచ్చినా, అదే ఎమోషన్ ను ఎన్నికల వరకూ ప్రజల్లో నిలబెట్టుకుంటూ రావడం, దాన్ని ఓట్లుగా కన్వెర్ట్ చేసుకోవడం కూడా జగన్ ముందున్న పెద్ద సవాలే.