తన తండ్రి బాటలోనే పాదయాత్ర చేసేందుకు విపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై ఏపీ కాంగ్రెస్ నేతలు స్పందిస్తున్నారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలు వేరనీ, ఆయన పేరుతో ఇప్పుడు జగన్ పొందాలనుకుంటున్న రాజకీయ లబ్ధి వేరుగా ఉందంటూ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసి రెడ్డి ఆరోపించారు. మహానేత వైయస్ నామస్మరణ చేస్తూ… మరోవైపు రాజశేఖర్ రెడ్డి ఆశయాలను సమూలంగా సమాధి చేస్తున్నారంటూ దుయ్యబట్టారు. వైయస్ అసలైన కాంగ్రెస్ వాది అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉంటూ టీడీపీ, భాజపాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరుసార్లు శాసన సభ్యుడిగా, నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా, రెండుసార్లు ఏపీ ముఖ్యమంత్రిగా పనిచేశారని అన్నారు. సోనియాను సీతాదేవిగా అభివర్ణిస్తూ ఉండేవారని అన్నారు.
కానీ, జగన్ మాత్రం ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారన్నారు. సోనియాపై విమర్శలు చేస్తూ ఉండటం, భాజపా సర్కారు మెప్పుకోసం వెంపర్లాడుతూ ఉండటం జగన్ కు అలవాటైపోయిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు మోడీ సర్కారు తీరని అన్యాయం చేసిందన్నారు. వీటి గురించి కేంద్రాన్ని నిలదీయాల్సిన జగన్.. స్వార్థ ప్రయోజనాల కోసం మోడీకి మద్దతు ఇస్తున్నారంటూ విమర్శించారు. ఇకపై జగన్ కూడా మోడీ డైరెక్షన్ లోనే పనిచేస్తారని ఎద్దేవా చేశారు. ఇకపై భాజపా చెప్పినట్టుగానే ఆంధ్రాలో వైకాపా, టీడీపీలు పనిచేస్తాయనీ.. భవిష్యత్తులో భాజపాతో పాటు టీడీపీ, వైకాపాలు కూడా పొత్తు పెట్టుకున్నా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నారు.
కాంగ్రెస్ ఇంటెన్షన్ చాలా క్లియర్ గా ఉంది. భాజపాకి జగన్ దగ్గరౌతున్న తీరును తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కాంగ్రెస్ సిద్ధపడుతోంది. జగన్ పాదయాత్రకు దిగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వైయస్ ఎంత నిబద్ధతతో ఉన్నారనేది ప్రచారంలోకి తెస్తున్నారు. అంతేకాదు, భారతీయ జనతా పార్టీతో పొత్తు కోసం గతంలో వైయస్ ఇలా వెంటపడలేదనే వాదనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉందని తెలుస్తోంది. వైయస్ వేరు.. జగన్ వేరు అనే భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కాంగ్రెస్ ఏమేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి. ఎందుకంటే, గతంలో వైయస్ వల్లనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అనేది వాస్తవం! ఆంధ్రాలో తన సొంత కరిజ్మాతోనే వైయస్ అభిమానులను పెంచుకున్నారు. జగన్ వైపు మళ్లిన ఆ అభిమానాన్ని… తిరిగి తెచ్చుకోవడం అనేది కాంగ్రెస్ ముందున్న పెద్ద సవాలు!