డీజే సినిమా వివాదాలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఏ ముహూర్తంలో ఈ సినిమా పట్టాలెక్కిందో గానీ.. ప్రతీసారీ ఏదో ఓ రూపంలో వార్తల్లో డీజే పేరు వినిపిస్తూనే ఉంది. డీజే చుట్టూ పుట్టుకొచ్చిన నెగిటీవ్ వార్తలు ఈమధ్య ఏ సినిమాపైనా చూళ్లేదు. ఆఖరికి రివ్యూలు కూడా నెగిటీవ్‌గానే వచ్చాయి. వీటన్నింటినీ తిప్పి కొట్టడానికా అన్నట్టు… డీజే వసూళ్లు ఘనంగా ప్రకటించుకొంది టీమ్. ‘నాన్ బాహుబలి రికార్డులన్నీ డీజే బద్దలు కొట్టేసింది’ అని ప్రకటించుకొంది. దాంతో… మెగా ఫ్యాన్స్‌కి చిరెత్తుకొచ్చింది. నాన్ బాహుబలి రికార్డంటే ఖైది నెం.150 వసూళ్లే. యావరేజ్ టాక్ వచ్చినా.. ఖైదీ వసూళ్లు ఎలా దాటేస్తుందన్నది చిరు ఫ్యాన్స్ అనుమానం. అందుకే.. దిల్‌రాజు ఆఫీసుని ముట్టడించారు. ఈ వసూళ్ల మర్మమేంటని నిలదీశారు. దిల్‌రాజు సర్దిచెప్పి పంపడంతో.. ఈ వేడి కాస్త చల్లారింది.
అయితే ఇక్కడితో అంతా అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. ఈ రోజు రాత్రి ఫిదా ఆడియో ఫంక్షన్ జరగబోతోంది. అక్కడ డీజే వసూళ్లపై దిల్‌రాజు ఓ క్లారిటీ ఇస్తాడట. ఆ లెక్కల్లో ఏమాత్రం తేడా వచ్చినా ఈ రుసబుసలు మళ్లీ మొదలైపోతాయి. ఈ టోటల్ ఎపిసోడ్ చూస్తుంటే.. డీజేపై ఎవరో బాగా కక్ష కట్టేశారు అనిపించడం ఖాయం. ఓ వర్గం.. డీజేని ముందు నుంచీ టార్గెట్ చేస్తూ వస్తోంది. డీజే టీజర్ ఎప్పుడైతే విడుదల అయ్యిందో అప్పటి నుంచీ.. డీజేపై నెగిటీవ్ పబ్లిసిటీ మొదలెట్టేసింది. ఆ పబ్లిసిటీ తమకు అనుకూలంగా మలచుకోవడంలో డీజే టీమ్ విఫలమైంది. దాంతో… నెగిటీవ్ పబ్లిసిటీ విషయంలో మంచి కంటే చెడే ఎక్కువ జరిగింది. బన్నీ కూడా మెగా హీరోనే. మెగా అభిమానుల్లో బన్నీ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. వాళ్లే… దిల్‌రాజుపై ఎగబడ్డారు, డీజేని కడిగేశారంటే.. మెగా ఫ్యాన్స్ బన్నీని వేరుగా చూస్తున్నారనే సంకేతాలు అందుతున్నాయి.
అయినా.. ఫ్యాన్స్ దూకుడు ఇబ్బంది కలిగించే విషయమే. ఇప్పుడంటే దిల్ రాజుని నిలదీశారు. రేప్పొద్దుట… మరో సినిమా వస్తుంది. వాళ్లు కూడా మేం నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టేశాం అంటారు.. అప్పుడు కూడా ఇలానే ఎగబడిపోతారా? వసూళ్ల లెక్కలు తీయండి అని అడుగ్గలరా?? అసలు ఖైదీ నెం.150 రికార్డులు ఫేక్ కావు అని గ్యారెంటీ ఏముంది? ఈరోజుల్లో ఈ రికార్డుల్ని ఎవడు నమ్మమన్నాడు? రికార్డులు కేవలం పబ్లిసిటీ స్టంట్ అన్నది అందరికీ తెలిసిన విషయమే. దాన్ని సీరియెస్ గా తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఏ సినిమాలో విషయం ఉంటే ఆ సినిమా ఆడుతుంది. డీజేలో పదును తగ్గింది. కాబట్టి.. నెగిటీవ్ టాక్ వచ్చింది. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి వసూళ్ల డ్రామా మొదలెట్టింది డీజే టీమ్. అంతే! అది ఇప్పుడు దిల్‌రాజు ఆఫీసుని ముట్టడించే వరకూ తీసుకెళ్లింది. ఈ సంప్రదాయం మంచిది కానే కాదు. వసూళ్లు గొప్పగా చెప్పుకోవడం మూలంగా ఈగోలు సంతృప్తిపడతాయేమో. ఖాళీ అయిన బయ్యర్ల జేబులు నిండవు. ఈ విషయాన్ని ఇరు వర్గాలు గుర్తుంచుకొంటే మంచిది.