వైఎస్ఆర్సిపి ప్లీనరీలో ప్రతిపక్ష నేత జగన్ చేసిన విమర్శలు వాస్తవం కాదని,అవగాహన లేకుండా మాట్లాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ ఎంపిలతో అన్నట్టు అధికారిక సమాచారం. వైసీపీ విమర్శలను పట్టించుకోనవసరం లేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. నిజంగానే మరో పార్టీ ప్రత్యర్థి పార్టీ ఏదో సభ పెట్టుకుంటే మంత్రులందరూ వరసకట్టి ఖండించడం అభద్రతను చూపిస్తుందని నిన్న చెప్పుకున్నాం. రాజకీయ స్పందన ఇచ్చేందుకు ఇతర మార్గాలుంటాయి. కాని నిన్న చేసిన విమర్శలు చాలక ఈ రోజు కూడా టిడిపి విమర్శల పరంపర కొనసాగింది. యువనేత లోకేశ్ కూడా ఇందుకు గొంతు కలిపారు. చంద్రబాబు కూడా అనాల్సినవి అని అనవసరం అన్నారు. నిజంగా ఆయన ఈ మాట ముందే చెప్పి వుంటే కొంతైనా శబ్ద కాలుష్యం తగ్గేది. మొదటి రోజు సమావేశాలు ముగియకముందే చెప్పాలంటే సమావేశాలు ప్రారంభం కావడానికి ముందు రోజే వైసీపీకి ఎక్కడ లేని ప్రచారమిచ్చిన వారు పాలకపక్షీయులే!
ఈ సందర్భంగా ప్రశాంత కిశోర్‌ను సలహాదారుగా పెట్టుకోవడం అపరాధమైనట్టు ఒక ప్రధాన విమర్శ చేశారు. అదే నిజమైతే తాము భాగస్వాములుగా వున్న ఎన్‌డిఎకు 2014 ఎన్నికల్లో ఇదే వ్యక్తి వ్యూహకర్తగా వున్నారు కదా.. అప్పుడెలా ఒప్పుకున్నారు? వారు చేస్తే ఒప్పు, ఇతరులైతే తప్పా?