హరీశ్ రావు తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ వార్తల్లో వుంటారు. టిఆర్ఎస్ శ్రేణుల్లో ఆయన పట్ల అదో ప్రత్యేక ఆకర్షణ. రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన ఉద్యమంలో ఉద్రేకాలు ఉద్రిక్తతలు సృష్టించడం కోసం ఆయన అనుసరించే పద్దతులు వేరుగా వుండేవి. హఠాత్తుగా పడవలో రావడం, మారు వేషంలో దర్శనమివ్వడం, ఎప్పటికప్పుడు ఎత్తుగడలు మార్చడం మీడియాకు మసాలానూ యువతకు హుషారును ఇస్తుండేవి. అవతలివారిపై చేయి చేసుకోవడం వంటి ఘటనలు విమర్శలకూ దారి తీసేవి. అయితే ఈ జోరు దూకుడు ప్రభుత్వంలోకి వచ్చాక తగ్గుముఖం పట్టాయన్నది నిజం. మొదటిది అధికారంలో వున్నందవల్ల బాధ్యతగా పెద్దరికంతో ప్రవర్తించడం కావచ్చు. అంతకంటే కూడా ఫ్రధానమైంది ముఖ్యమంత్రి కెసిఆర్ తన కుమారుడు కెటిఆరే భావి అధినేత దాదాపు స్పష్టంగా సంకేతాలివ్వడం.. ప్రతిసారి అవసరాన్ని మించి ఆ వైపు నొక్కడం. ఇది చాలా సార్లు చెప్పుకున్న విషయమే గాని ఈ మధ్య కొంత మార్పు కనిపిస్తుంది. ఏమంటే ఎన్నికలకు కెసిఆర్ నాయకత్వం తప్ప ఇతర వివాదాలు విభేదాలు నష్టం చేస్తాయన్న అంచనా టిఆర్ఎస్లో పెరిగింది. హరీశ్‌ను కూడా సందర్బాన్ని బట్టి ప్రశంసించడం కూడా పెరిగింది. అయితే అధినేతలో అంతర్గతంగా పెద్ద మార్పు రాలేదని అందరికీ తెలుసు. కాని ఇప్పటికైతే ఈ వాతావరణాన్ని సద్వినియోగం చేసుకోవడం మంచిదని హరీశ్ నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్ వారిపై అవకాశం దొరికితే వంటికాలితే లేస్తున్నారు, మాటకు మాట చెబుతున్నారు. సభలూ పర్యటనలూ కూడా పెంచారు, తాజాగా ఆయన ఉద్యమకారుడిగా వున్నప్పటి తరహాలోనే మోటారుబైక్ వేసుకుని తన మూలపీఠమైన సిద్దిపేటలో కలియదిరిగారు. ఆ సందర్భంగా ఆయన వేేష ధారణ సంచారం సంరంభం అన్నీ ఉద్యమ కాలాన్ని గుర్తు చేసే దిశలో వున్నాయి. తన వెంట వస్తానన్న పోలీసులను కూడా వద్దని ఆపేశారట. ఇదే చొరవతో దూకుడుతో ఆయన జనంలోకి వెళ్లి తనేమిటో చూపిస్తారని అనుచరులు సహచరులు అంటున్నారు. తధాస్తు. అయితే ఇలాటి వాటిని బట్టి ఆయన తిరుగుబాటు చేస్తాడని వూహాల వ్యూహాలు చెప్పేవారు మాత్రం నిరుత్సాహపడక తప్పదు. ఎందుకంటే మామ నాయకుడుగా వున్నంత కాలం హరీశ్ తిరగబడటం జరగని పని. అది తన రాజకీయ జీవితాన్నే దెబ్బ తీస్తుందని ఆయన గట్టిగా నమ్ముతారు. పైగా ఇప్పటికిప్పుడు తెలంగాణలో అంత మార్పు వచ్చే సన్నివేశం(సీన్) కూడా లేదు.