తెలంగాణ ఉద్యమం ఎప్పుడో అయిపోయిందనీ… ఇంకా గొడవలు పెట్టుకుంటూ ఉంటారంటే అది వారి ఇష్టం అన్నారు కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ! ఇంతకీ ఎవర్ని ఉద్దేశించి అన్నారంటే… నిజామాబాద్ ఎంపీ కె. కవితను! ఏ విషయంలో అంటే.. ఒక లెటర్ అంశంలో! ఈ ఇద్దరి మధ్యా ఈ లెటర్ వార్ కు కారణమౌతోంది జగిత్యాలలో ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి ఏర్పాటు అంశం. పాత కరీంనగర్ జిల్లాలోని కోరుట్ల, జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతాల్లో బీడీ కార్మికులు అధిక సంఖ్యలో ఉంటారన్న సంగతి తెలిసిందే. వారి కోసం ప్రత్యేకంగా ఒక ఇ.ఎస్.ఐ. ఆసుపత్రిని ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాన్నాళ్లుగా ఉంది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ కవిత కూడా ఇదే అంశంపై కేంద్రాన్ని ఎప్పటికప్పుడు కోరుతూనే ఉన్నారు. అయితే, కేంద్రం నుంచి ఎలాంటి స్పందనా ఇంతవరకూ రాలేదు. ఇదే అంశమై ఆమె ఈ మధ్య చెబుతూ ఉన్నారు.
అయితే, కేంద్రమంత్రి దత్తాత్రేయ తాజాగా దీనిపై స్పందించారు. జగిత్యాల ఇ.ఎస్.ఐ. ఆసుపత్రి ఏర్పాటుకు సంబంధించి తనవద్దకు ఇంతవరకూ ఎలాంటి విజ్ఞప్తులూ రాలేదనీ, లిఖిత పూర్వకంగా ఎంపీ కవిత కూడా తనకు ఎలాంటి లేఖలూ రాయలేదని కేంద్రమంత్రి అన్నారు. గతంలో ఓసారి విమానంలో కలిసి ప్రయాణిస్తున్న సమయంలో నిజామాబాద్ ఆసుపత్రి గురించి మాట్లాడరనీ, ఆ తరువాత ఆమె లెటర్ రాయకపోయినా సరే నిజామాబాద్ ఆసుపత్రిని అప్ గ్రేడేషన్ చేశామన్నారు. సమస్య తన దృష్టికి రాగానే స్పందించామన్నారు. ఎంపీ కవిత తనతో గొడవ పడాల్సిన అవసరంలేదనీ, తన కార్యాలయానికి వస్తే సాదరంగా స్వాగతిస్తామన్నారు. తెలంగాణ ఉద్యమం అయిపోయిందనీ, గొడవలు పడాల్సిన అవసరం లేదన్నారు. ఒక్క మాట చెబితే ఆ అంశంపై కూడా సానుకూలంగా స్పందిస్తామని దత్తన్న చెప్పారు.
అయితే, దత్తాత్రేయ కామెంట్స్ పై కవిత ఘాటనేగా స్పందించారు. ఇదే అంశమై తాను నవంబర్ లో కేంద్రానికి రాసిన లేఖను విడుదల చేశారు. అంతేకాదు, దీనిపై దత్తాత్రేయ కార్యాలయం నుంచి తనకు అందిన మరో లేఖను కూడా మీడియా ముందుంచారు. దత్తన్న ఇలా స్పందించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రానికి సంబంధించి కొన్ని అంశాలపై ఆయన ఈ మధ్య ఇలానే స్పందిస్తున్నారంటూ తెరాస వర్గాలు గుర్రుగా ఉన్నాయి. రాష్ట్ర సమస్యలపై తెలంగాణ సర్కారు అలసత్వాన్ని ప్రదర్శిస్తోందనీ, కేంద్ర ప్రభుత్వమే సకాలంలో స్పందిస్తోందనే ధోరణిలో దత్తన్న వ్యవహారి శైలి ఉంటోందని తెరాస వర్గాలు తప్పుబడుతున్నాయి. జగిత్యాల ఇ.ఎస్.ఐ. ఏర్పాటుకు సంబంధించిన లేఖకు దత్తన్నే స్వయంగా స్పందించినట్టు కవిత ఓ లేఖను మీడియాకు చూపించారు. మరి, దీనిపై కేంద్రమంత్రి స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఓ పక్క ఢిల్లీ స్థాయిలో భాజపాతో దోస్తీ కోసం తెరాస అర్రులు చాచుతుంటే.. రాష్ట్రంలో తెరాసతో దత్తాత్రేయ వ్యవహార శైలి ఇలా మారుతోందేంటో అనే చర్చ జరుగుతోంది.