ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న నియోజక వర్గాల పునర్విభజనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు! అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈ విషయాన్ని సీఎం వెల్లడించారు. పునర్విభజన ఖాయమనీ, అసెంబ్లీ నియోజక వర్గాలకు పెంపునకు కేంద్రం సుముఖంగా ఉందనీ, దీని కోసం తెలుగుదేశం నేతలంతా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వచ్చేవారం నుంచి పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. తనకున్న సమాచారం ప్రకారం అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశం ఉందన్నారు.
ఇంతకుముందు అనుకున్నట్టుగా రాజ్యాంగ సవరణ అవసరం లేదనీ, పార్లమెంటు అనుమతితో ఒక జీవో తీసుకొస్తే నియోజక వర్గాల సంఖ్య పెంపు ప్రక్రియ ప్రారంభమైపోతుందని కేంద్రమంత్రి సుజనా చౌదరి చెప్పారు. జిల్లాలను ఒక యూనిట్ తీసుకోవడానికి బదులు, లోక్ సభ స్థానాన్ని ఒక యూనిట్ గా తీసుకుని పునర్విభజన ఉంటుందన్నారు. కొత్త లెక్కల ప్రకారం ఒక్కో ఎంపీ సెగ్మెంట్ కింద 9 శాసన సభ నియోజక వర్గాలు వస్తాయనీ, మొత్తంగా ఏపీలో 225 శాసన సభ నియోజక వర్గాలు అవుతాయని ఈ సమావేశంలో చెప్పారు. వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా పార్టీకి అన్ని విధాలుగా మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని ఈ సందర్భంగా వ్యక్తీకరించారు.
ఏదైతేనేం, అనుకున్నట్టుగానే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో అసెంబ్లీ సీట్ల బిల్లును ఆమోదింపజేసుకుంటున్నారు! ఈ విషయంలో చంద్రబాబుతోపాటు, తెలుగుదేశం ఎంపీల కృషిని కూడా కచ్చితంగా అభినందించాలి! నిజానికి, టీడీపీ ఎంపీలు ఢిల్లీలో క్రియాశీలకంగా లేరు అనే విమర్శ ఆ మధ్య వినిపించేది. అదేనండీ.. ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో వారు ఫెయిల్ అయ్యారనీ, ముఖ్యమంత్రి కూడా సరిగా డీల్ చేయలేదని అనేవారు. ఇప్పుడు చూడండి… అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపు విషయంలో ఎంత క్రియాశీలంగా ఉన్నారో..? ఆ మధ్య ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా చంద్రబాబు, కేసీఆర్ కలిసి మరీ ఇదే విషయమై కేంద్రంతో ఎంత చక్కగా డీల్ చేశారో! ప్రత్యేక హోదా పోతేనేం… రైల్వేజోన్ రాకపోతేనేం… నిధులు సకాలంలో ఇవ్వకపోతేనేం.. నియోజక వర్గాల సంఖ్య పెరుగుతోంది చాలు కదా! ఈ సంఖ్య చాలదూ.. ఒక సగటు ఆంధ్రుడు ఆనందించడానికీ, గర్వించడానికీ, పండుగ చేసుకోవడానికీ..!