డీజే వసూళ్లపై చిరంజీవి ఫ్యాన్స్ గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. నిర్మాత దిల్‌రాజు అన్నీ తప్పుడు లెక్కలు చూపిస్తున్నారని, ఖైదీ నెం.150 వసూళ్లని డీజే ఏమాత్రం అందుకోలేదని.. మెగా ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ఇదే విషయమై.. సోమవారం దిల్‌రాజుని నిలదీయడం తెలిసిందే. డీజే వసూళ్ల గురించి ‘ఫిదా’ ఆడియో ఫంక్షన్లో చెబుతానని దిల్‌రాజు క్లారిటీ ఇచ్చి, ఫ్యాన్స్‌ని కూల్ చేసే ప్రయత్నం చేశాడు. ఫిదా ఆడియోలో దిల్‌రాజు ఏం మాట్లాడతాడా, వసూళ్ల గురించి ఏం చెబుతాడా? అనే ఆసక్తి నెలకొంది. అయితే.. రాజుగారు మాత్రం ఈ ఇష్యూని చాలా తెలివిగా డీల్ చేసేశారు.
ఫిదా ఆడియోలో దిల్‌రాజు ఇచ్చిన స్పీచ్ చూస్తే… సింహభాగం మెగాస్టార్‌ని పొగడ్డానికే కేటాయించారు. చిరు లేనిదే, ఇంత మంది హీరోలు వచ్చేవారు కాదని, మెగాస్టార్ ఎప్పుడూ మెగాస్టారే అని మెగా ఫ్యాన్స్ ని కూల్ చేసే ప్రయత్నం చేశారు. సోషల్ మీడియాలో కొంతమంది ఖైదీ నెం.150కీ, డీజేకీ పోలికలు పెడుతూ పోస్ట్‌లు చేస్తున్నారని, చిరు సినిమా ఓ స్పెషల్ అని, దానికి ఏ సినిమాతోనూ పోలికలు లేవని చెబుతున్నాడు దిల్‌రాజు. ఇంత చెప్పినా… వసూళ్ల గురించి మాత్రం మాట్లాడలేదు. మెగా ఫ్యామిలీలో చిరు ది బెస్ట్ అని చెప్పడంతో… ఈ డీజే వివాదానికి పుల్ స్టాప్ పడినట్టే అన్నది దిల్ రాజు కాంపౌండ్ వాళ్ల మాట. మరి… మెగా ఫ్యాన్స్ శాంతిస్తారా?? లేదా??