ఎస్బీఐ చైర్మన్ అరుంధతీ భట్టాచార్య తాజాగా చేసిన ఓ వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. బ్యాంకు రుణాలను చెల్లించలేని వారిని నేరస్థులుగా చూడవద్దని ఆమె సూచన. ఎగ్గొడతారని మనం రుణాలివ్వకుండా ఉంటామా! కట్టరని ఊహిస్తామా!! కొన్నికొన్ని పరిస్థితులలో ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకని వారిని నేరస్థులుగా చూడవద్దంటూ హితవు పలికారు. సామాన్య రుణ గ్రహీతల నుంచి ముక్కుపిండి రుణాలను వసూలు చేస్తుంటారు బ్యాంకు అధికారులు. నోటీసుల మీద నోటీసులు పంపి, ఫోన్లమీద ఫోన్లు చేసి, ఆఖరుకు లీగల్ నోటీసులు ఆపై కోర్టు సమన్లు జారీ చేయించి చేతులు దులుపుకుంటారు. ఖర్మ కాలి ఆ నోటీసులు ఆఫీసుకు వెళ్ళాయా అతగాడి ఉద్యోగం ఊడిపోతుంది. ఇవన్నీ అరుంధతి గారికి తెలుసా తెలీదా.. వేల కోట్లు ఎగ్గొట్టి.. తప్పించుకోడానికి చట్టంలో లొసుగులను అడ్డుపెట్టుకుని తప్పించేసుకుంటుంటే.. వారికి అప్పులిచ్చిన పెద్ద స్థాయి అధికారులు అదే చట్టాన్ని ఆసరాగా చేసుకుని, బయటపడిపోతారు. దర్జాగా కేంద్రంలో అధికారం వెలగబెడుతున్న వారూ ఉన్నారు. చిక్కు మాత్రం సామాన్యులకూ, నెలసరి వేతనగాళ్ళకే వస్తుంది. అరుంధతి వ్యాఖ్యల వెనుక మర్మం..విజయ్ మాల్యానూ కూడా నేరస్థుడిగా చూడకూడదనా? అదే ఆమె మాటల అంతరార్థమైతే ఆర్థిక వ్యవస్థకు మరింత ప్రమాదం ముంచుకొచ్చినట్లే. మరికొన్ని వేల కోట్లు కృష్ణార్పణమైపోయినట్లే. ఆన్లైన్లో నగదు లావాదేవీలపై రుసుం వసూలును ఎవరూ తప్పుపట్టనక్కరలేదు. ఎందుకుంటే బ్యాంకుకు వెళ్ళడానికి ఇంధన ఖర్చు.. పట్టే సమయంతో బేరీజు వేసుకుంటే ఆ మొత్తం చాలా తక్కువే. విజ్ఞతాపూర్వకమైన ఇలాంటి నిర్ణయాలను ఆహ్వానించే వారు.. రుణాలు ఎగ్గొట్టేవారిని నేరస్థులుగా చూడరాదన్న ప్రకటనలను ససేమిరా అంగీకరించారు!
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి