తెలంగాణ ఏర్పడ్డ తరువాత జరుగుతున్న ప్రతీ పార్లమెంటు సమావేశాల సమయంలోనూ ఇదే అంశం ప్రధానంగా చర్చకు వస్తోంది. తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు పెంచడం ఖాయమనే మాట ఎప్పట్నుంచో వినిపిస్తోంది. అయితే, ఈసారి మాత్రం నియోజక వర్గాల పునర్విభజన పక్కా అనీ, పార్టీ సిద్ధంగా ఉండాలంటూ సీఎం చంద్రబాబు తాజాగా పార్టీ ఎంపీలతో చెప్పిన సంగతి తెలిసిందే. డ్రాఫ్టు బిల్లు సిద్ధమైందనీ, న్యాయ శాఖ సలహా కూడా తీసుకోవడం పూర్తయిందనీ, పార్లమెంటులో ప్రవేశపెట్టడమే మిగిలి ఉందని ప్రతీసారీ నేతలు చెబుతూనే వచ్చారు. కానీ, ఇంతవరకూ పార్లమెంటులోకి ఆ బిల్లు వచ్చిందే లేదు. అయితే, ఈ విషయమై కేంద్రం ఇంతవరకూ తాత్సారం చేయడానికి కారణం… రాజకీయ కోణమే. నియోజక వర్గాల పునర్విభజన విషయం చర్చకు వచ్చిన ప్రతీసారీ అధికార పార్టీ పెద్దలు భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వైపు చూస్తున్నారట! దీంతో ఇప్పుడు కూడా అమిత్ షా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకనే ప్రాసెస్ మొదలౌతుందని ఢిల్లీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ సీట్ల సంఖ్యపై భాజపా ఇంతగా మీనమేషాలు లెక్కించాల్సిన అవసరం ఏముందీ అంటే… రాజకీయ ప్రయోజనమే! ఈ నిర్జయం వల్ల భాజపాకి ఒనగూరే ప్రయోజనం ఏంటనేదే అసలు చర్చ అన్నట్టుగా తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు భాజపాకి సోలోగా అనుకూలించేలా ఇప్పటికైతే లేవు. వచ్చే ఎన్నికల్లో కూడా తెలుగు రాష్ట్రాల్లో ఏదో ఒక ప్రాంతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిందే. నియోజక వర్గాల సంఖ్య పెంచడం వల్ల తెరాస, టీడీపీలకు మాత్రమే ప్రయోజనం ఉంటుందనేది భాజపా అంచనా. ఎందుకంటే, రెండు రాష్ట్రాల్లోని అధికార పార్టీలూ పెద్ద ఎత్తున ఫిరాయింపులు ప్రోత్సహించి, ఇతర పార్టీల నేతల్ని అక్కున చేర్చుకున్నాయి. వారికి స్థానం కల్పించాలంటే సీట్ల సంఖ్య పెంచాల్సిందే. అందుకే, ఇద్దరు సీఎంలు ఏకమై మరీ కేంద్రంపై ఒత్తిడి పెంచుతున్నారు.
అయితే, తెలంగాణలో సీట్ల సంఖ్య పెంపుపై ఇక్కడి భాజపా నేతలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల భాజపాకి నష్టమే అని స్పష్టం చేస్తున్నారు. ఏపీ నేతల నుంచి ఇలాంటి వ్యతిరేకత పెద్దగా రాకపోయినా, నియోజక వర్గాల సంఖ్య పెంచితే అది టీడీపీకి మాత్రమే పనికొస్తుందనే అభిప్రాయాన్ని అక్కడి నేతలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడీ రెండు వాదనలూ భాజపా అధినాయకత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. భాజపా కేంద్ర నాయకత్వం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప.. ఈ విషయమై అడుగు ముందుకు పడే పరిస్థితి లేదన్నట్టుగా ఢిల్లీ భాజపా వర్గాలు అంటున్నాయి. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. నియోజక వర్గాల సంఖ్య పెంపు ప్రక్రియ జరుగుతోందనీ, అయితే ఎప్పట్లోగా పూర్తి కావొచ్చనేది తాను చెప్పలేనని ఆయన స్పష్టం చేశారు. కేంద్ర తీరు ఇలా ఉంటే.. పెంపు ఖాయమని చంద్రబాబు ఫిక్స్ అయిపోయారు! ఈ విషయంలో భాజపా ఇంకా ఒక నిర్ణయానికి రానట్టుగా పరిస్థితులు కనిపిస్తున్నాయి.