భాజపా ఆంధ్రాకి ఇచ్చిన హామీల్లో కీలకమైంది విశాఖ రైల్వే జోన్. ఇదిగో అదిగో వచ్చేస్తోందని టీడీపీ, భాజపా నేతలు చెబుతూ ఉన్నా… కేంద్ర మాత్రం దీనిపై ఇప్పటికీ స్పష్టతకు రాలేకపోతున్నట్టు సమాచారం! ఎందుకంటే, ఆంధ్రాకి ఇచ్చిన ఈ హామీని రాజకీయాంశంగా చూస్తూ ఉండటం! రాజకీయ కోణం నుంచే ప్రయోజనాలను లెక్కలేసుకుంటూ ఉండటం! విశాఖ రైల్వే జోన్ ఇచ్చేస్తే… ఒడిశ్శా నుంచి వ్యతిరేకత వ్యక్తమయ్యే పరిస్థితులు ఉన్నట్టు భాజపా అంచనా వేస్తోందట. ఆంధ్రాకి ప్రత్యేక జోన్ ఇచ్చేస్తే రాజకీయంగా ఒడిశ్శాలో భాజపాకి అనుకూలంగా ఉండదనేది పార్టీ వర్గాల అభిప్రాయంగా తెలుస్తోంది.
భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో విశాఖపట్నం ఉంది. దీంతో రైల్వే ఉద్యోగాలు ఆశిస్తున్న అభ్యర్థులు ఒడిశ్శాకు వెళ్లి పరీక్షలు రాయాల్సిన పరిస్థితి వస్తోంది. అయితే, తమ ఉద్యోగాలను ఉత్తరాంధ్రులు ఎగరేసుకుని వెళ్లిపోతున్నారనే వ్యతిరేకత కూడా అక్కడ వ్యక్తమౌతోంది. పరీక్ష రాయడానికి వస్తున్న ఉత్తరాంధ్రులను అడ్డుకుంటున్న ఘటనలు అడపాదడపా ఆ రాష్ట్రంలో చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ఎప్పుడైతే విశాఖ జోన్ ను ప్రకటిస్తామని భాజపా చెప్పిందో… ఉత్తరాంధ్ర నిరుద్యోగుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. ఇక, ఈస్ట్ కోస్ట్ రైల్వేకి విశాఖపట్నం నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తుంది. బొగ్గు రవాణా, స్టీల్ ప్లాంట్ నుంచి ఉత్పత్తుల ఎగుమతులూ దిగుమతులతో రైల్వేకు బాగా ఆదాయం వచ్చేది ఇక్కడి నుంచే. ఆదాయపరంగా ఇంత ప్రాధాన్యత ఉన్న విశాఖను తమ జోన్ నుంచి తప్పించేందుకు ఒడిశ్శా భాజపా నేతలు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది.
ఒకవేళ విశాఖను భువనేశ్వర్ జోన్ నుంచి తప్పిస్తే… భాజపా నేతల నుంచే కాకుండా, సామాన్యుల నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమౌతుందని వారు చెబుతున్నారట. దీంతో కేంద్రం ఎటూ తేల్చలేకపోతోందంటూ వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. 2019లో ఒడిశ్శా అసెంబ్లీకి ఎన్నికలు ఉన్నాయి. విశాఖ జోన్ విషయంలో నిర్ణయం తీసుకుంటే… దాని ప్రభావం ఒడిశ్శాలో భాజపాపై పడే అవకాశం ఉందనేది ఆ పార్టీ అధినాయకత్వం ఆలోచనగా తెలుస్తోంది. మొత్తానికి, విశాఖ రైల్వే జోన్ అంశం రాజకీయాంశంగా మారిందని చెప్పొచ్చు. అందుకే, ఈ విషయమై కొన్నాళ్లపాటు ఎటూ తేల్చకుండా, ప్రస్థావించకుండా ఉంటేనే బెటర్ అనే ధోరణిలో భాజపా ఉందని ఢిల్లీ వర్గాలు అంటున్నాయి.
ఇక, తెలుగుదేశం పాయింటాఫ్ వ్యూ నుంచి ఆలోచిస్తే.. రైల్వేజోన్ సాధించుకోవడం అనేది రాజకీయావసరం! ఎందుకంటే, ఎలాగూ ప్రత్యేక హోదాను కేంద్రం ఇవ్వలేదు. ప్యాకేజీ తెచ్చామని గొప్పలు చెప్పుకున్నా… హోదాని సాధించలేకపోయారన్న అపప్రద టీడీపీపై బాగానే పడి ఉంది. ఇప్పుడు రైల్వే జోన్ కూడా సాధించలేకపోతే.. వచ్చే ఎన్నికల్లో ఇది కూడా ప్రతిపక్షానికి ప్రధానాస్త్రంగా మారే అవకాశం ఉంది. కాబట్టి, కేంద్రంపై ఈ విషయమై కూడా ఈ మధ్య టీడీపీ ఒత్తిడి పెంచుతోంది.