అందాల రాక్షసితో ఆకట్టుకొన్న దర్శకుడు హను రాఘవపూడి. ఆ సినిమా అంతగా ఆడలేదు గానీ, హనులో ఉన్న టేస్ట్‌ని ఆ సినిమా బయటపెట్టేసింది. కృష్ణగాడి వీర ప్రేమగాథతో కాస్త రూట్ మార్చాడు. ప్రేక్షకులకు కావల్సిన, కోరుకొన్న వినోదం పంచి పెట్టాడు. ఇప్పుడు నితిన్ తో కలసి ‘లై’ చేస్తున్నాడు. టీజర్ కూడా వచ్చేసింది. అది కాస్త… అదరహో అనిపించేలా ఉంది. ‘లై’ని ‘లై’క్ చేసేవాళ్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారంతా. అయితే… ‘లై’ సెట్లో షూటింగ్ అంత సజావుగా సాగలేదన్నది ఇన్నర్టాక్. హను రాఘవపూడికీ అర్జున్‌కీ మధ్య కొంత గ్యాప్ ఏర్పడిందని, అమెరికాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓసారి దర్శకుడిపై అలిగి అర్జున్ సెట్లోంచి బయటకు వెళ్లిపోయాడని తెలుస్తోంది.
సెట్లో కూర్చుని సీన్లు రాసుకోవడం హనుకి అలవాటుగా మారుతోందట. అది.. అర్జున్‌కి నచ్చలేదని తెలుస్తోంది. షాట్ రెడీ అయ్యాక కూడా.. హను కరక్షన్ అంటూ కూర్చోవడం కాస్త ఇబ్బంది కలిగిస్తోందట. హనుపై నమ్మకంతో నితిన్ ఏమీ అనలేకపోతున్నాడు గానీ, అర్జున్ చాలాసార్లు బయటపడిపోయాడని, ఈ షూటింగ్ సవ్యంగా సాగుతుందా, లేదా? అనేంతగా ఇద్దరి మధ్య గ్యాఫ్ ఏర్పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. హను వర్కింగ్ స్టైల్ ఎలా ఉన్నా… అవుట్ పుట్ మాత్రం బాగా వస్తే చాలు. ‘లై’ టీజర్ చూస్తే.. విషయం ఉన్న సినిమాలానే అనిపిస్తోంది. అదే నిజమై.. సినిమా హిట్టయితే.. ఈ మైనస్సులన్నీ మర్చిపోవడం ఎంత సేపు..??