అది సంకల్పితమో, అసంకల్పితమో తెలీదుగానీ… మెహబుబాబాద్ జిల్లా కలెక్టర్ ప్రీతీ మీనా పట్ల తెరాస ఎమ్మెల్యే శంకర్ నాయక్ అనుచితంగా ప్రవర్తించారు! మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా ఆమె భుజంపై చేయి వేసి, నెట్టే ప్రయత్నం చేశారు. దీంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. వెంటనే ఆమె ఎమ్మెల్యే వైఖరిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు ఐ.ఎ.ఎస్.ల సంఘానికి కూడా ఫిర్యాదు చేసేశారు. ఆమెకు మద్దతుగా కొంతమంది అధికారులు కూడా హరితహారం కార్యక్రమంలోనే నల్లబ్యాడ్జీలు ధరించుకుని నిరసనకు దిగేశారు. ఈ విషయం ముఖ్యమంత్రి కేసీఆర్ కు కూడా వెంటనే చేరిపోయింది. ఆఘమేఘాల మీద ఆయన స్పందించారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ ప్రవర్తనకు విచారం వ్యక్తం చేస్తూ, ఈ వివాదాన్ని మరింత ముదరకుండా ఉండేలా చర్యలు చేపట్టారు. ప్రభుత్వం తరఫు నుంచి కలెక్టర్ బుజ్జగించేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాదు, ఎమ్మెల్యేని కూడా ఘాటుగా మందలించారు. చివరికి, కలెక్టర్ ప్రతీ మీనాకి ఎమ్మెల్యే శంకర్ నాయక్ క్షమాపణలు కూడా చెప్పారు.
ఈ ఘటనపై ముఖ్యమంత్రి వరకూ అందరూ చకచకా స్పందించడాన్ని మెచ్చుకోవాల్సిందే. అయితే, ఈ ఘటనకు ఇంత ప్రాధాన్యత ఎందుకు కల్పించారు..? కలెక్టర్, ఎమ్మెల్యేల మధ్య ఏవైనా వివాదాలు ఉన్నాయా..? దీని వెనక వేరే రాజకీయ కోణం ఉందా..? అంటే, అవుననే చెప్పాల్సి వస్తోంది. ఎమ్మెల్యే, కలెక్టర్ల మధ్య గత కొన్నాళ్లుగా మాటల యుద్ధం సాగుతోందని తెలుస్తోంది. కలెక్టర్ ప్రీతీ మీనా తీరుపై శంకర్ నాయక్ బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారట. ఆమెను బదిలీ చేయాలంటూ గతంలో ప్రభుత్వాన్ని కోరిన సందర్భాలూ ఉన్నాయి. ఏకంగా ముఖ్యమంత్రి దగ్గర కూడా ఆమె బదిలీ విషయాన్ని గతంలో ప్రస్థావించి, ప్రయత్నించారట. అయితే, ఆమెపై శంకర్ నాయక్ ఎందుకింత అసంతృప్తిగా ఉన్నారంటే.. దానికి కొన్ని కారణాలున్నాయనే చెబుతున్నారు!
శంకర్ నాయక్ కు సంబంధించిన కొన్ని ఫైళ్లూ, కేసుల విషయంలో ప్రీతీ మీనా చాలా నిక్కచ్చీగా ఉంటున్నారట. ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని వివాదాస్పద అంశాల విషయంలోనూ ఆమె ధీటుగా స్పందిస్తున్నారట. ఎమ్మెల్యే పరిధికి మించిన ఆయన సిఫార్సులు చేస్తుంటే ఆమె అడ్డుకున్నట్టు చెబుతున్నారు. దీంతో శంకర్ నాయక్ ఆమెపై ఆగ్రహించారనీ, బదిలీ చేయించాలని ప్రయత్నించారనీ అంటున్నారు. ఇప్పుడు హరితహారం కార్యక్రమంలో కలెక్టర్ చేతిని ఎమ్మెల్యే తాకారు. ఆమె కంటతడి పెట్టడంతో అధికారులు అండగా నిలవడం, ముఖ్యమంత్రి స్పందించడం, ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పడం వరకూ విషయం వెళ్లింది. ఈ ఇద్దరి మధ్యా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని తెలుసు కాబట్టే, వివాదానికి ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేసీఆర్ చొరవ తీసుకున్నారని చెబుతున్నారు. అంతేకాదు, శంకర్ నాయక్ పై మొదలైన ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు కొంతమంది స్వపక్ష నేతలే కాచుకుని కూర్చున్నారనీ, అందుకే వెంటనే ఆయనతో క్షమాపణలు చెప్పించారనే అభిప్రాయమూ వినిపిస్తోంది.