నవ్యాంధ్ర రాజధాని నగరం అమరావతిని ప్రపంచంలోనే టాప్-5 నగరాల సరసన చేర్చాలన్నది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభిలాష. హైటెక్ హైదరాబాద్ ను నిర్మించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. అదే ఆశతో టీడీపీకి ఆంధ్రా ప్రజలు అవకాశాన్ని ఇచ్చారు, అధికారాన్నిచ్చారు. అయితే, చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటేస్తున్నా.. రాజధాని నిర్మాణం శంకుస్థాపనలకు మించి జరగలేదు. అమరావతిలో ఎలాంటి నిర్మాణాలు ఉండాలనే దశలోనే ఇంకా చర్చలు కొనసాగుతూ ఉన్నాయి. ముందుగా ఓ అంతర్జాతీయ సంస్థకు డిజైన్ల రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఆ డిజైన్లపై అందరూ పెదవి విరిచారు. ఆ తరువాత, ఆ కంపెనీని తప్పించారని ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తానికి, ఇన్నాళ్లకు ఓ రెండు డిజైన్లను సీఎం చంద్రబాబు ఎట్టకేలకు ఫైనలైజ్ చేశారు.
శాసన సభ, మండలి సముదాయ భవనం కోసం వజ్రాకృతిలో ఉన్న డిజైన్ ని ముఖ్యమంత్రి ఎంపిక చేశారు. నవ్యాంధ్రలో నిర్మించబోతున్న హైకోర్టు భవనం కోసం స్థూపాకారంలో ఉన్న ఆకృతిని ఎంపిక చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు డిజైన్ ను ప్రధాన న్యాయమూర్తికి పంపించాలనీ, అలాగే ఇతర భవన నమూనాలను కూడా ఒకట్రెండు రోజుల్లో చూపించాలంటూ సీఎం చెప్పారు. అమరావతిలో కీలక నిర్మాణాల డిజైన్లను పోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. హైకోర్టు భవనం కోసం నార్మన్ పోస్టర్స్ రూపొందించిన వజ్రాకృతి భవన నమూనాను సీఎం పరిశీలించారు. అయితే, ఈ వజ్రాకృతి నిర్మాణం శాసన సభ, మండలి సముదాయానికి అయితే బాగుంటుందనీ, హైకోర్టు కోసం స్థూపాకారమే బెటర్ అని సీఎం చెప్పారు. రాష్ట్ర ప్రజలు గతంలో ఎంతో విలువైన ఓ వజ్రాన్ని పోగొట్టుకున్నారనీ, ఇప్పుడు ఆ నమూనాను అసెంబ్లీ, కౌన్సిల్ బిల్డింగ్ లో చూసుకుంటూ ఆనందిస్తారని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు.
ఇక, స్థూపాకార హైకోర్టు భవన నమూనా గురించి మాట్లాడుతూ… స్థూపాకృతి ఆనందానికీ సంతోషానికీ చిహ్నమనీ, ఇక్కడి వస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం ప్రజల్లో కలిగించేలా భవన నమూనా ఉంటుందనీ, కోర్టు గుమ్మం తొక్కేవారికి సంతోషంగా అనిపించాలనే ఉద్దేశంతోనే ఈ డిజైన్ ను ఫైనల్ చేసినట్టు చంద్రబాబు వివరించారు. అమరావతి న్యాయ నగరంగా ప్రపంచఖ్యాతి పొందాలన్నారు. అత్యుత్తమ న్యాయ సలహా, న్యాయ విద్య అనగానే అందరూ అమరావతివైపే చూడాలన్న స్థాయిలో నగరం ఉండాలని ఆకాంక్షించారు.
ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఆకారాలూ బాగున్నాయి, ఆకాంక్షలూ బాగున్నాయి. కానీ, ఇవన్నీ కార్యరూపంలోకి ఎప్పుడొస్తాయి..? ఈ భవనాల నిర్మాణాలు ఎన్నాళ్లకు పూర్తవుతుతాయి..? దానికి సంబంధించి ప్రణాళిక ఏదైనా ఉందా..? వచ్చే ఎన్నికలలోపు మహా అయితే డిజైన్ల ఎంపిక మాత్రమే పూర్తి చేసి… మరోసారి మాకు అధికారం ఇస్తే మిగతా నిర్మాణాలు జరుగుతాయని ఎన్నికల హామీగా అమరావతి నిర్మాణాన్ని చేర్చుకునే వ్యూహంతో టీడీపీ ఉందని అనిపిస్తోంది.