విశాఖ భూ కుంభకోణం.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఓరకంగా ఇరుకునపెట్టిన అంశం. విశాఖ చుట్టూ పెద్ద ఎత్తున భూములు ఆక్రమణలకు గురౌతున్నాయంటూ ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి.. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసింది. గత నెల 28 నుంచే సిట్ రంగంలోకి దిగింది. ఇద్దరు సీనియర్ ఐపీఎస్ లు, విశాఖ జాయింట్ కలెక్టర్ సహా పాతికమంది అధికారులున్న ఈ దర్యాప్తు బృందం, నివేదికను తయారు చేసే క్రమంలో కీలక చర్యలు చేపడుతోంది. అయితే, సిట్ ముందుకు ఫిర్యాదులు వెల్లువగా వస్తున్నాయి. ఇప్పటివరకూ దాదాపు 1150 ఫిర్యాదులు అందినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సిట్ గడువును కుదించడంపై కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
విశాఖ భూదందాపై రాజకీయ పార్టీలు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాన ప్రతిపక్షమైన వైకాపా అయితే ఇదే అంశాన్ని ప్రధాన విమర్శనాస్త్రంగా మార్చేసుకుంది. ఆరోపణలపై పుస్తకాలు కూడా ముద్రించేసింది. అయితే, ఆరోపణలకు ఆధారాలో జతచేసి పంపితే, దర్యాప్తులో భాగంగా పరిశీలిస్తామంటూ రాజకీయ పార్టీలకు పోలీస్ కమీషనర్ యోగానంద్ లేఖలు రాశారు. ఈ లేఖపై రాజకీయ పార్టీల నుంచి కూడా సానుకూల స్పందనే లభిస్తోంది. ఇప్పటికే వామపక్షాలు సిట్ ముందుకు చాలా అర్జీలను తీసుకొచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచీ బాధితులను సిట్ ముందుకు తీసుకొస్తున్నాయి.
ఇదే క్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు కూడా స్పందించారు! గతంలో విశాఖ భూకుంభకోణానికి సంబంధించి ఈయనే కొన్ని కీలక ఆరోపణలు చేశారు. విశాఖకు చెందిన మరో మంత్రి గంటా శ్రీనివాసరావును టార్గెట్ చేసుకుని విమర్శించిన సందర్భం ఉంది. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారంటూ ముఖ్యమంత్రికి మంత్రి గంటా ఫిర్యాదు చెయ్యడం, ఆ తరువాత ఈ అంశంపై సీఎం సీరియస్ కావడం చూశాం. ఈ దందాపై సమగ్ర దర్యాప్తు జరగాలన్నదే ఇద్దరి అభిమతమనీ, ఎలాంటి గొడవలూ తమ మధ్య లేవంటూ అయ్యన్న పాత్రుడు స్వరం మార్చుకోవాల్సి వచ్చింది. అయితే, రాజకీయ పార్టీల ఆరోపణలపై ఆధారాలను కమిషనర్ కోరిన నేపథ్యంలో… తాను చేసిన ప్రతీ ఆరోపణకూ కట్టుబడి ఉన్నాననీ, ఆధారాలు ఉన్నాయనీ, వాటిని సిట్ కు అందిస్తామని అంటున్నారు మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు.
దీంతో ఇప్పుడు మరోసారి అందరి దృష్టీ మంత్రి అయ్యన్న వైపునకు మళ్లుతోంది. ఇంతకీ, సిట్ కు ఆయన సమర్పించబోతున్న ఆధారాలు ఏంటనేవి చర్చగా మారుతోంది. ముఖ్యమంత్రి జోక్యంతో గంటాతో వివాదం సమసిపోయినా.. ఈ ఇద్దరి మధ్య విభేదాలు ఈనాటివో, లేదా, ఈ అంశానికో పరిమితమైనవో కావు కదా! తాను చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటున్నారు! గతంలో ఆయన చేసిన ఆరోపణలన్నీ ఇన్ డైరెక్డ్ గా గంటాను టార్గెట్ చేసుకున్నవే కదా! మరి, ఈ నేపథ్యంలో గంటా ఏమైనా స్పందిస్తారేమో..!