బిజెపి టిడిపి మధ్య దాగుడుమూతల్లో ఆంధ్ర ప్రదేశ్కు రావలసిన వచ్చిన నిధులపైన ఇతర అంశాలపైన స్పష్టతే లేకుండా పోతున్నది. ప్రత్యేక హౌదాను ప్యాకేజీ అన్నారు గాని ఆ మాటల మాయాజాలం ఇప్పటికీ ఒక కొలిక్కి వచ్చింది లేదు. స్పష్టంగా చెప్పాలంటే ప్రత్యేక హౌదా గాక రెవెన్యూలోటు, వెనకబడిన ప్రాంతాలకు ప్రత్యేక నిధి, రాజధానికి తగినన్ని నిధులు కేంద్రం నుంచి నిర్దిష్టంగా అందవలసి వుంది. ఇవన్నీ అరకొరగానే వచ్చాయి. కాని ఆ మాట గట్టిగా చెప్పే ధైర్యం టిడిపి ప్రదర్శించలేకపోతున్నది. ఎవరైనా బిజెపిపై గట్టిగా మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దని వెంటనే వారిస్తున్నారట. ఇప్పుడు జగన్తో వారి నేస్తం పెరిగిన తర్వాత మరింత జాగ్రత్త తీసుకోవలసిందేననుకుంటున్నారు.
మేమిచ్చినా లెక్కలు చెప్పలేదని బిజెపి దబాయిస్తున్నా కూడా వాస్తవాలు చెప్పలేని స్థితి టిడిపి ప్రతినిధులది. పోనీ బిజెపి వారేమైనా ఆ మాట మీద నిలబడి టిడిపిని సవాలు చేస్తారా అంటే అదీ వుండదు. అందుకే నేను వీటిని దాగుడు మూతలంటుంటాను. ఎన్టివి చర్చలో బిజెపి విష్ణువర్థనరెడ్డి తాము అమరావతి నిర్మాణానికి 20 వేలకోట్లు ఇచ్చామంటే టిడిపి రేణుక కాదని స్పష్టంగా చెప్పలేదు. ఈ మధ్య ముఖ్యమంత్రి ఎంపిల సమావేశం జరిపి రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించాల్సిన 108 అంశాల ఫైలు ఇచ్చారు.విచిత్రమేమంటే ఇవి గత మూడేళ్లుగా చెప్పుకుంటున్నవే. తాము ఇచ్చినవి చెప్పడం లేదని బిజెపి వారంటారు గాని వాస్తవానికి అవి దేశంలో ప్రతిరాష్ట్రానికి ఎలాగూ ఇవ్వాల్సినవే. అలాగే రాజధాని లెక్కలో విజయవాడ గుంటూరు డ్రైనేజి నిధులను కూడా కలిపి చెబుతుంటారు. కేంద్రం ఇంత ఉపేక్ష వహిస్తున్నా అఖిలపక్షం జరపడానికి గాని అందరినీ కలుపుకొని ఒత్తిడి తేవడానికి గాని ప్రభుత్వం సిద్ధం కాదు. ప్రత్యేక హౌదా కోసం రాజీనామాలు చేస్తామన వైసీపీ కూడా ఇప్పుడు రాజీ బాటలో వుంది గనక ఇది అంతే.