నంద్యాల ఉప ఎన్నికల్లో గెలిచి తీరాలన్న పట్టుదలతో అధికార పార్టీ తెలుగుదేశం వ్యూహాత్మకంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ నియోజక వర్గం పార్టీ బాధ్యతల్ని నలుగురు మంత్రులు షేర్ చేసుకుంటున్నారు. సీనియర్ నేతలు ప్రచారంలోకి దిగుతున్నారు. దీంతోపాటు నంద్యాలలో పలు అభివృద్ధి కార్యక్రమాలపై టీడీపీ సర్కారు ప్రత్యేక శ్రద్ధ, దృష్టి, ఏకాగ్రత లాంటివి చాలా పెట్టింది. గడచిన మూడేళ్లుగా పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనులు చకచకా అయిపోతున్నాయి! అంతేకాదు, కొత్త కొత్త వరాలను కూడా నంద్యాలపై కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాలో పర్యటించారు మంత్రి లోకేష్. ఆయనతోపాటు సోమిరెడ్డి, కాల్వ శ్రీనివాసులు, మంత్రి అఖిల ప్రియలు కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. నంద్యాల నియోజక వర్గంలోని రైతు నాగారం గ్రామంలో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ కేంద్రాన్ని మంత్రి లోకేష్ ప్రారంభించారు.
నంద్యాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నట్టుగా పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. మరో వారం రోజుల్లో నంద్యాలలో ఈ క్యాంటీన్లు అందుబాటులోకి వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. నిజానికి, తమిళనాడులోని నాటి సీఎం జయలలిత ప్రారంభించిన అమ్మ క్యాంటీన్ల స్ఫూర్తితో ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని చాన్నాళ్ల కిందటే డిసైడ్ అయ్యారు. కానీ, ఇంతవరకూ అది కార్యరూపం దాల్చలేదు. నంద్యాల ఉప ఎన్నిక పుణ్యమా అని ఇది ఆచరణకు నోచుకుంటోంది. ఇంతేకాదు.. నంద్యాల రోడ్ల కోసం కూడా రూ. 114 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. ఉప ఎన్నిక రావడంతో నంద్యాల నియోజక వర్గంపై అధికార పార్టీకి అంతులేని ప్రేమ ఒకేసారి పొంగుకు రావడం విశేషం! అక్కడి సమస్యలన్నీ ఇప్పుడే కనిపిస్తూ ఉండటం ఆశ్చర్యం! ఉప ఎన్నికల్లోపే పరిష్కారం చూపించేయాలన్న తత్తరపాటుతో వరాలు కురిపిస్తూ ఉండటం విడ్డూరం!
ప్రభుత్వపరంగా అభివృద్ధి పనుల్లో ఇంత వేగం కనిపిస్తుంటే, మరో పక్క పార్టీపరంగా కూడా టీడీపీ కొన్ని పనులు చేస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చే వారిని చేర్చుకోవడం కోసం స్థానికంగా నంద్యాలలో ఓ కమిటీని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. ఆ ప్రాంతంలోని మైనారిటీ ఓటర్లను ఆకర్షించడం కోసం ముస్లిం నేతలకు తాజాగా పదవుల్ని కట్టబెట్టారు. ఎన్నికలు వస్తే తప్ప.. ప్రజల సమస్యలు ప్రభుత్వాలకి కనిపించకపోవడం విచారకరం. ఎన్నికలు వస్తే తప్ప.. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చెయ్యాలనే చైతన్యం అధికార పార్టీకి పుట్టకపోవడం బాధ్యతా రాహిత్యం. ఎన్నికలు వస్తే తప్ప.. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే స్పృహ కలగకపోవడం అధికార పార్టీ చేస్తున్న ఓటు బ్యాంకు రాజకీయం!