ఓ వర్థమాన నటుడు.. ఓ ప్రముఖ గాయని..ఇటీవలే విడుదలైన ఓ సినిమా హీరో.. ఇద్దరు ప్రముఖ నిర్మాతలు..హీరోగా ప్రయత్నించి ఫలించక సెకండ్ హీరోగా సెటిలయిపోయిన కథానాయకుడు.. ఇవేంటనుకోకండి…డ్రగ్స్ కేసులో ఉన్నారని చెబుతున్న సినీ ప్రముఖుల పేర్లు. వినేవాడు వెర్రివెంగళాయి అయితే ఎన్నయినా చెబుతారనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. వీరి పేర్లు బయటపెట్టరు.. ఎందుకంటే…వారికీ మీడియాకి మధ్య ఎన్నో బంధాలూ-అనుబంధాలు పెనవేసుకుని పోయి ఉంటాయి. ఈ పరస్పర గాఢానుబంధం విచ్ఛిన్నం కావడానికి ఇరువురూ అంగీకరించరు. ఎందుకంటే ఆ ప్రముఖ నటుల పేర్లు బయటకు రాకూడదు. ఒక్క మీడియానే కాదు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇదే వైఖరి అనుసరిస్తోంది. గ్యాంగ్‌స్టర్ నయీంను ఎన్కౌంటర్ చేసిన అనంతరం, నిర్భయంగా పేర్లను విడుదల చేసి, అహాఓహో అనిపించుకున్న కేసీఆర్ సర్కారు ఎందుకీ కప్పదాట్లు వేస్తోంది. అసలు సినిమా నటులతో సర్కారుకు పనేమిటి? పరిశ్రమకు కోపమొస్తుందనా.. లేక సినీ పరిశ్రమను గుప్పెట్లో పెట్టుకున్న ఆ నాలుగు కుటుంబాల అనుమతి రాలేదా? అనుమతి వస్తే ఎవరి పేర్లు ఈ జాబితాలో ఉంటాయనేదానిపైనే ఇప్పుడు అందరి దృష్టీ కేంద్రీకృతమై ఉంది.
గతంలో ఎవరి మద్దతూ.. కింగ్‌మేకర్ లేకుండానే సినీ రంగంలో రివ్వున దూసుకొచ్చిన యువ హీరో ఉన్నట్లుండి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సమయంలోనైనా ఆ తరవాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టుండాల్సింది. ఇప్పుడు ఉడ్తా హైదరాబాద్ అంటూ మీడియా ఊదరగొట్టేస్తున్న డ్రగ్స్ వ్యవహారంలో అధికారులు కూడా డ్రగ్స్ వాడుతున్న వారి పేర్లను వెల్లడించడం లేదు. విచారణకు హాజరయినప్పుడు ఎలాగూ బయటపడుతుందనే ధోరణిలో వారున్నారు. మీడియా కూడా ఇదే వైఖరిని అనుసరిస్తోంది. విచారణకు హాజరయ్యేలోగా జాబితాలో మార్పులు జరగవని గ్యారెంటీ లేదు. నాలుగు స్తంభాల్లాంటి కుటంబాలు ఏం చెబితే పరిశ్రమలో అదే జరుగుతుంది. ఇప్పుడీ డ్రగ్స్ వ్యవహారంలోనూ రెండు కుటుంబాలు పెద్ద మనుషుల్లా తలదూర్చాయి. అలా చేసుంటే తప్పేనని అన్నాయి. ఈ వ్యవహారంలో ఓ ప్రముఖ రచయితనూ వెంటబెట్టుకొచ్చాయి. ఆ రచయితకు పరిశ్రమలో మంచి పేరుంది. వర్థమాన హీరోలకూ, దర్శకులకూ అండగా నిలుస్తారనీ, మంచి సలహాలు ఇస్తారనీ పేరుంది. ఆయన్ను రంగంలోకి తీసుకొచ్చి తమపై ఉన్న మచ్చను చెరిపేయాలనుకుంటున్నారా? ఎవరెలా వ్యవహరించినా అసలు దోషులు తప్పించుకోకూడదు. నేరం చేసిన వ్యక్తిని ఎలా చూస్తారో పోలీసులు డ్రగ్స్ మత్తులో మునిగిపోయిన వారినీ అలాగే చూడాలి. పేర్లు చెప్పండి. మీరు చేసినట్లే ముసుగులేసి, మీడియా ముందుకు తీసుకురండి. అప్పుడే చట్టం ముందు నేరస్తులంతా ఒకటేననే అభిప్రాయాన్ని కలుగజేయగలుగుతారు.
షూటింగులలో మానసికంగానూ, శారీరకంగానూ అలసిపోయి రాత్రి పూట మద్యం సేవించి చాలామంది సేదదీరుతారు. అది వారి వ్యక్తిగతం. సమాజానికి చెడుచేసే కొకైన్ వంటి మత్తుపదార్థాలను సేవిస్తున్నారనే అంశం సమాజానికి ఎటువంటి సందేశాన్నీ, సంకేతాన్ని పంపుతుంది. తమ హీరోలాగే ఉండాలనీ, ప్రవర్తించాలనీ తపన పడే యువత ఇప్పుడు కొకైన్ తీసుకోవడాన్నీ ఆదర్శంగా తీసుకుంటే. ఇప్పటికైనా ఆ ఆరోపణ ఎదుర్కొంటున్న ప్రముఖులు తమంతతాముగా బయటకు వచ్చి, తప్పు అంగీకరించి, అందరిముందు లెంపలేసుకోవాలి. ఐదు దశాబ్దాల క్రితం పైకొస్తున్న కొందరు నటులు మద్యానికి బానిసలై కెరీర్‌ను పాడుచేసుకున్నారు. దీనివెనుక అలనాటి ప్రముఖుల హస్తం ఉందని అప్పుడూ ఆరోపణలు వినిపించాయి. మద్యానికీ, మత్తుకూ బానిసవడం వెనుక వేరొకరి ప్రోద్బలం ఉండాలా? మన బుద్ధేమైంది? మన కెరీర్ ముఖ్యమనుకుంటే బలహీనతలు మనపై విజయం సాధించలేవు. సమాజంపై ప్రభావం చూపే నటులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుంటే వారికీ.. వీరికీ కూడా మేలు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి