తొందరపడి ఒక కోయిల ముందే కూసిందో లేదో తెలీదుగానీ.. ఎన్నికలకు దాదాపు రెండేళ్లు సమయం ఉన్నా కూడా ఇప్పట్నుంచే ఆ రేసులోకి దిగిపోయారు ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి. అన్న వచ్చేస్తున్నాడంటూ జనంలోకి వెళ్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో ఇప్పుడే ప్రకటించేశారు. అక్టోబర్ లో పాదయాత్ర చేసేందుకు సిద్ధపడిపోయారు. అయితే, వైసీపీ ఈ రేస్ స్టార్ట్ చేయడంతో.. ఇష్టం ఉన్నా లేకున్నా తెలుగుదేశం కూడా స్పందించాల్సి వస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చెయ్యడం, జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం చంద్రబాబు సిద్ధం కావడం.. ఇవన్నీ వైసీపీ ప్లీనరీ ప్రభావాలు. అయితే, జగన్ ఇలా దూకుడుగా ముందుకు వెళ్తుండటం పార్టీకి చాలామంచిదే అనే అభిప్రాయం టీడీపీ నేతల్లో కొంతమంది వినిపిస్తూ ఉండటం విశేషం!
పార్టీ అధికారంలో ఉన్నా కూడా రాజకీయం పటిష్టమైన వ్యూహాలతో తెలుగుదేశం వ్యవహరించడం లేదన్న అసంతృప్తి కొంతమంది నేతల్లో ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదనే అభిప్రాయం కూడా ఈ మధ్య వినిపిస్తున్నదే! గతంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీగా ఉన్నప్పుడు పక్కా వ్యూహాలు ఉండేవనీ, ఇప్పుడు అలాంటివి లేకుండా పోయాయని అంటున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ఉండాల్సిన స్వల్పకాలిక, దీర్ఘ కాలిక వ్యూహాలు లేకుండా పోయాయని సీనియర్లు అంటున్నారు. అంతేకాదు, ఒకప్పుడు పార్టీ తరఫున బలంగా మాట్లాడే బాధ్యతల్ని పయ్యావుల కేశవ్, ధూళిపాల నరేంద్ర, గాలి ముద్దుకృష్ణమ నాయుడు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు వంటి నేతలు తీసుకునేవారు. కానీ, ఇప్పుడు వారి సేవల్ని చంద్రబాబు సరిగా వినియోగించుకోవడం లేదనే విమర్శ ఉంది. ముఖ్యంగా పయ్యావుల, ధూళిపాల వంటి నాయకుల్ని అధినాయకత్వం దూరం చేసుకుంటోందన్న అభిప్రాయం ఉంది. ఇక, యనమల ప్రభుత్వ వ్యవహారాలకే పరిమితం అయిపోతున్నారు. సోమిరెడ్డి, గాలి ముద్దుకృష్ణమ వంటి నేతలు పార్టీ తరఫున విపక్షానికి సమాధానాలు ఇస్తున్నా… సరైన వ్యూహం లేకపోవడంతో ప్రభావవంతంగా ఉండటం లేదన్న అభిప్రాయమూ ఉంది.
పార్టీ వ్యూహాలు అంటే ఏసీ గదుల్లో కూర్చుని ఆలోచిస్తే చాలు అనే అభిప్రాయం కొంతమందిలో పెరిగిందనీ, జగన్ జనంలోకి వెళ్లడం మొదలయ్యాక వాస్తవాలు అధినాయకత్వానికి తెలుస్తాయనేది సీనియర్ల అభిప్రాయం. వైసీపీ ప్లీనరీ వల్ల తమ తప్పుల్ని దిద్దుకునేందుకు ఉపయోగపడుతుందని అంటున్నారు! ప్రభుత్వ పథకాలు అమలు తీరు బాగానే ఉన్నా.. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కొంతమంది నేతలు క్రియాశీలంగా ఉండటం లేదన్న విమర్శను ఇప్పటికైనా అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంటుందనేది సీనియర్ల అభిప్రాయంగా తెలుస్తోంది. మొత్తానికి, జగన్ దూకుడును తమను తాము విశ్లేషించుకునేందుకు వీలు కల్పించిన ఓ అవకాశంగా టీడీపీ సీనియర్ నేతలు చూస్తున్నారు. మరి, సీనియర్లు ఆశిస్తున్నట్టుగా ఈ తరహా విశ్లేషణాత్మక బుద్ధితో అధినాయకత్వం వ్యవహరిస్తుందా లేదా అనేది వేచి చూడాలి.