కాపుల రిజర్వేషన్ల విషయమై ప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకునే వరకూ విడిచిపెట్టేది లేదన్న పట్టుదలతో ఉన్నారు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం. ఈ నెల చివరి వారంలో మరోసారి పాదయాత్ర నిర్వహించేందుకు సన్నాహాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. జస్టిస్ మంజునాథ కమిటీ రిపోర్టు వస్తే రిజర్వేషన్లు వచ్చేస్తాయని గతంలో చెప్పారనీ, కానీ ఇప్పుడా కమిటీ నివేదిక మరింత ఆలస్యం అయ్యే సూచనలు ఉన్నాయని ముద్రగడ అంటున్నారు. అంతేకాదు, రిపోర్టు వచ్చినా రిజర్వేషన్లు అనుమానమే అని జస్టిస్ మంజునాథ స్వయంగా కామెంట్ చెయ్యడం, కమిటీ చేస్తున్న అధ్యయనం బీసీల్లో వెనుకబాటు తనాన్ని తెలుసుకోవడం కోసం జరుగుతున్నదిగా ఆయనే అభివర్ణించడంతో మరోసారి ఉద్యమ బాటలోకి వచ్చారు ముద్రగడ.
అయితే, ఎప్పటిలానే ఆయన పాదయాత్రకు అనుమతుల్లేవంటూ పోలీసుల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే కిర్లంపూడిలో సెక్షన్ 144 అమల్లోకి తెచ్చినట్టు కూడా కథనాలున్నాయి. ముద్రగడ చేపట్టబోతున్న పాదయాత్ర గురించి తాము చర్చించుకున్నట్టు ఏపీ డీజీపీ సాంబశివరావు చెప్పారు. ఈ నెల 26 నుంచి ముద్రగడ చేపట్టబోతున్న పాదయాత్రకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. అనుమతులు ఇవ్వకపోవడానికి గల కారణాన్ని కూడా చెప్పారు. అంతకుముందు ఇటువంటి యాత్రల వల్ల పెద్ద ఎత్తున ఆస్తినష్టం జరిగిందీ, ప్రజల్లో అభద్రతా భావాన్ని కలిగించేలా గతంలో ఇలాంటివి చాలాసార్లు జరిగాయని డీజీపీ చెప్పారు. గతంలో అమలాపురం పరధిలో జరిగిన కొన్ని సంఘటనలు, ఆ మధ్య తునిలో కూడా అలాంటి పరిస్థితులే తలెత్తాయన్నారు. చేపట్టబోయే కార్యక్రమం ఏదైనాసరే, అది హింసతో కూడుకున్నదై ఉంటే, శాంతిభద్రతలకు విఘాతం కల్పించేదిగా ఉంటుందని తెలిస్తే, పోలీసులుగా శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత తమకు ఉంటుందని సాంబశివ రావు చెప్పారు. సో… పోలీస్ బాస్ చెప్పాల్సింది చెప్పేశారు! ఈసారి కూడా ముద్రగడ పాదయాత్ర కిర్లంపూడి దాటి బయటకి అడుగుపడే సూచనలు కనిపించడం లేదు.
విచిత్రం ఏంటంటే.. ముద్రగడ దీక్షకు దిగిన ప్రతీ సందర్భంలోనూ డీజీపీ స్పందించడం! ఇదేదో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కార్యక్రమం జరుగుతున్నట్టు చెప్పడం రొటీన్ అయిపోయింది. గతంలో ముద్రగడ దీక్ష చేసిన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల గురించే ప్రతీసారీ మాట్లాడుతున్నారు. అంతేగానీ, ప్రస్తుతం కాపుల రిజర్వేషన్ల కోసం పనిచేస్తున్న మంజునాథ కమిషన్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం స్పందన ఉండటం లేదు. గత ఏడాది ఆగస్టుకే రిపోర్టు ఇచ్చేస్తామన్న కమిషన్, మరో ఏడాది గడుస్తున్నా నివేదిక తయారు చేయడానికి ఇంకా టైం పడుతుందని ఎందుకు చెబుతోంది..? కాపుల రిజర్వేషన్ల కోసమే కమిషన్ ఏర్పాటు చేశామని నాడు సీఎం చంద్రబాబు చెబితే… ఇది బీసీల వెనకబాటుతనంపై జరుగుతున్న అధ్యయనం తాజాగా మంజునాథ ఎందుకు కామెంట్ చేశారు..? తమను కూడా బీసీల్లో చేర్చాలంటూ దాదాపు 32 కులాలు కమిషన్ ముందు గోడు వినిపించుకుంటే, ప్రభుత్వం స్పందన ఏదీ..? ముద్రగడ పాదయాత్ర వెనక ఉన్న ప్రశ్నలివి. వీటిపై దృష్టి పెడితే.. ఈ దీక్షలూ ధర్నాలూ ఉద్యమాలూ ఉండవు కదా! కాపుల రిజర్వేషన్ల అంశం వదిలేసి.. ముద్రగడ దీక్షను శాంతిభద్రతల కోణం నుంచే ఎన్నాళ్లు డీల్ చేస్తారు..?