ఒక కీలకమైన కేసు అత్యంత ప్రధాన ఘట్టానికి చేరుకున్న తరుణంలో సంబంధిత అధినేత వ్యక్తిగత కారణాలంటూ పది రోజులు సెలవు పెడుతున్నానని తెలియజేయడం దేనికి సంకేతం. ఎక్సయిజ్ కమిషనర్ అకున్ సబర్వాల్ చేసిన ఈ ప్రకటన ఇప్పుడు డ్రగ్స్ కేసును మించి ప్రకంపనలు రేపుతోంది. సాధారణంగా సెలెబ్రిటీలకు సంబంధించిన అంశాలు.. మంచైనా..చెడైనా విపరీతంగా ఆకర్షిస్తాయి. ఇవే మీడియాకు కొన్ని రోజులకు సరిపడా సరంజామాను అందిస్తాయి. రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించిననాటి నుంచి చాపకింద నీరులా సాగిన విచారణ ఒక్కసారిగా బాంబులా పేలింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్నే కాకుండా సినిమా పరిశ్రమను కుదిపేసింది. సినీ ప్రముఖులు ఒకే వేదికపైకి వచ్చి, సినీ పరిశ్రమకు ఎటువంటి సంబంధం లేదని ప్రకటించాల్సి వచ్చింది. తాజాగా ఈరోజు రవి తేజ, పూరి జగన్నాథ్ సహా కొంతమంది ప్రముఖులకు ఎక్సయిజ్ శాఖ నోటీసులందడం.. ఈ నెల 19 నుంచి వారిని విచారించనుండటం వంటి పరిణామాల మధ్య సబర్వాల్ సెలవులో వెళ్ళడం మరో సంచలనానికి దారితీసింది. ప్రత్యేకంగా ఆయన తనపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళూ లేవని చెప్పడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తన సెలవు పూర్తిగా వ్యక్తిగతమైనదనీ, రెండు నెలల క్రితం సెలవు పెడితే ఇప్పుడు మంజూరైందనీ ఆయన చెబుతున్నారు. రెండు నెలల క్రితం దరఖాస్తు చేసుకుంటే ఇప్పుడు మంజూరు చేయడమేంటి? ఇది చాలదా ఒత్తిళ్ళ గురించి చెప్పడానికి? ఇంతవరకూ మంజూరు చేయకుండా కీలకమైన తరుణంలో సబర్వాల్కు సెలవు తీసుకోమని చెప్పడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? ఈ కేసు విచారణ ముగిసిన తరవాత సెలవివ్వచ్చుగా. ఒత్తిళ్ళ స్థాయిని ఇదే చెబుతుంది. అదే రాజకీయం. హీటెక్కిస్తారు.. కరిగిపోయే సమయానికి నీళ్ళు పోసేస్తారు. నోటీసులందుకున్నవారంతా సచ్చీలురనే ఓ ప్రకటన విడుదలవుంతుంది. మత్తు కథా చిత్రం ముగింపునకు వచ్చేస్తుంది. ఇలాంటి చర్యలు ప్రభుత్వ ప్రతిష్టను పెంచవని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి