మొత్తానికి మంత్రి అయ్యన్న పాత్రుడు అదరగొట్టారు.విశాఖ భూ కుంభకోణం గురించి మొదటి నుంచి తాను చేస్తున్న ఆరోపణలను అధికారికంగా సిట్‌కు సమర్పించారు. అంతటితో ఆగక 190 కోట్ల విలువైన అక్రమాలపై సమాచారం అందజేశానని మళ్లీ 19వ తేదీన కలిసి మరిన్ని కేసుల వివరాలు ఇస్తానని మీడియాతో చెప్పారు. ఒక మంత్రి దర్యాప్తు సంఘానికి ఫిర్యాదు చేయడమే విశేషమైతే ఆ వివరాలు మీడియాతో పంచుకోవడం మరింత అరుదు. అధికార పార్టీకి అధినేతకు ఇది మింగుడుపడకపోవచ్చు. పెదగంట్యాడ దగ్గర మెడిటెక్ పార్క్ కోసం 270 ఎకరాల భూమి సేకరణలో ప్రభుత్వ భూమిని తమదిగా చెప్పి ఎకరానికి 12 లక్షల చొప్పున అక్రమంగా పరిహారం తీసుకున్నారని ఆయన వెల్లడించారు. దీనిపై తాను కలెక్టర్‌కు రెండుసార్లు లేఖ రాసినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు.ఒక మంత్రి నోటి నుంచి ఇలాటి మాటలు రావడం ప్రభుత్వానికి అభిశంసనే గాక అప్రతిష్ట కూడా. ఇక ఇప్పుడు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు ఎలా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే ఆయన ఏకంగా సిబిఐ విచారణే జరగాలని కోరి వున్నారు.