కాపుల రిజర్వేషన్ల సాధన దిశగా ‘చలో అమరావతి పాదయాత్ర’ చేసేందుకు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం సన్నద్ధమౌతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వం ఎన్నిరకాలు అడ్డంకులు సృష్టించినా తాను పాదయాత్ర చేసి తీరతా అంటూ ప్రకటించారు. అయితే, ముద్రగడ పాదయాత్రపై పోలీసులు ఇప్పటికే స్పందించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా ముద్రగడకు అనుమతి ఇవ్వలేమంటూ తాజాగా డీజీపీ సాంబశివ రావు ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో ముద్రగడ చేపట్టిన యాత్ర హింసాత్మకంగా మారింది కాబట్టి, అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు కట్టుదిట్టంగా వ్యవహరిస్తామని పోలీస్ బాస్ చెప్పేశారు. అయితే, గతంలో తాను చేపట్టబోయే దీక్షలకు పోలీసులను అనుమతి కోరేందుకు ముద్రగడ ససేమిరా అనేవారు. శాంతియుతంగా చేపడుతున్న కార్యక్రమాలకు పర్మిషన్ తో పనేముందీ అనేవారు. కానీ, ఆయన ధోరణిలో కాస్త మార్పు కనిపిస్తోంది! చలో అమరావతి యాత్రకు పోలీసులు అనుమతి కోరతాను అంటూనే ఓ మెలిక పెడుతున్నారు! ఆ మెలిక ఎలా ఉందంటే.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని వ్యవహారంలోకి లాగేట్టు ఉంది!
సీఎం చంద్రబాబు నాయుడు గతంలో రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేశారనీ, ఎన్నికల సమయంలో ప్రజల్ని ఆయన కలుసుకున్న సందర్భాన్ని ముద్రగడ గుర్తు చేశారు. చంద్రబాబు పాదయాత్ర చేసినప్పుడు పోలీసులను ఏవిధంగా అనుమతులు కోరారో… పోలీసులు ఏ తరహాలో అనుమతులు ఇచ్చారో ఆ పత్రాలకు తనకు ఇవ్వాలని ముద్రగడ కోరారు. అదే పద్ధతిని అనుసరించి తాను కూడా పాదయాత్ర అనుమతులు కోరతాననీ, పోలీసులు తన యాత్రకు పర్మిషన్ ఇవ్వాలని ముద్రగడ అన్నారు. చంద్రబాబు పాదయాత్ర అనుమతి కాపీ ఇస్తే, తన దరఖాస్తుకు జత చేస్తానంటూ పోలీసులను కోరారు. కాపులకు ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకుంటారనే తాను ఆశిస్తున్నాను అన్నారు. పోలీసు రికార్డులు తీస్తే ఎవరి నేర చరిత్ర ఏంటో అందరికీ తెలుస్తుందనీ, తాను చేసిన నేరాలంటో నిరూపించాలంటూ ముఖ్యమంత్రికి ముద్రగడ సవాలు విసిరారు. ఈ నెలాఖరులోగా కాపుల రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆమోదించాలనీ, దాన్ని కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. సెక్షన్ 30 అమలు అంటూ తనని భయభ్రాంతులకు గురి చేసేందుకు ప్రయత్నిస్తున్నారనీ, జులై 26న తలపెట్టిన పాదయాత్ర ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని ఆయన తేల్చి చెప్పారు.
మొత్తానికి, ముద్రగడ పాదయాత్ర ఇష్యూ మళ్లీ చర్చనీయాంశంగా మారింది. రొటీన్ గా అయితే ముద్రగడ ఏదో ఒక యాత్ర అనగానే ముందుగా పోలీసులు స్పందిస్తారు. అనుమతుల్లేవంటారు. అది మొన్ననే జరిగిపోయింది. రొటీన్ గా అయితే.. పోలీసుల తరువాత ప్రభుత్వం తరఫున ఇప్పుడు మంత్రి చినరాజప్ప స్పందించాలి! రిజర్వేషన్లకు తాము కట్టుబడి ఉన్నామని, ముద్రగడ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎవరో ఒకరు వ్యాఖ్యానించాలి. ప్రభుత్వం తరఫున ఈ వాదన వినిపించేందుకు ఎవరు ముందుకొస్తారో చూద్దాం మరి!