శాసనసభ స్థానాల పెంపుదల జరిగిపోతుందని ఒకసారి ఆలోచించాలని మరోసారి కేంద్ర బిజెపి నేతలు రకరకాల సంకేతాలిస్తున్నారు. కాంగ్రెస్ నాయకులేమో ఇతర ప్రాధాన్యతలు వదిలిపెట్టి సీట్ల పెంపుదల మాత్రమే ముందుకు తెస్తే తాము అడ్డుకుంటామని అల్టిమేటం ఇచ్చారు. అయితే విభజన చట్టం ప్రకారం కేంద్రం కావాలంటే పెద్ద సంక్షోభం లేకుండానే ఈ తతంగం ముగించవచ్చు. అయితే అందుకు అడ్డంకి ఆ పార్టీ వారే .. అందులోనే అద్యక్షుల వారే! ఇప్పుడున్న స్థితిలో ఏపిలో ఏ ఎదుగుదల లేని బిజెపికి ఈ పెంపుదల వల్ల లాభం ఏమిటని అమిత్‌షా తో సహా సంస్థాగత నాయకులు అడ్డుకుంటున్నారు. చంద్రబాబు, కెసిఆర్‌ల ప్రోద్బలంతో ఫిరాయించిన వారికి టికెట్లిచ్చినా పాత వారిని నిలబెట్టుకోవాలంటే సీట్లు పెరగాల్సిందే. కాబట్టి వారు ఆ విషయంలో చాలా పట్టుదలగా వున్నారు. ఆందోళన చెందుతున్నారు కూడా. ఏమైనా ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లు వచ్చే అవకాశం నాస్తి. తమాషా ఏమంటే బిజెపితో ఏకీభవించే పార్టీ వైఎస్‌ఆర్‌సిపినే. గతంలో ఓడిపోయిన చోట్ల ఎలాగో కాలూ చెయ్యి కూడదీసుకుని బలం పెంచుకోవాలని ఆ పార్టీ తంటాలు పడుతున్నది. ఉన్నఫలాన యాభై సీట్లు పెరిగితే అభ్యర్థులు ఆర్థిక వనరులూ అంతర్గత ఐక్యత అన్నీ చిక్కులో పడతాయని వైసీపీ సంకోచం. అయితే కాంగ్రెస్‌లా నేరుగా వ్యతిరేకించడానికి లేదు గనక వీరు కూడా ప్రాధాన్యతలు పాటించాలనే పాట పాడుతున్నారు. ఆ వాదన నిజమే గాని అంతా అనుకూలంగా వుంటే అలాటి పార్టీలు నాలుగు సీట్టు ఎక్కువుంటేనే మేలనుకుంటాయి. ఏమైనా ఇప్పుడు మోడీ అమిత్‌షాల అంతిమ నిర్ణయంపైనే ఈ పెంపుదల ఆధారపడి వుంటుంది తప్ప రాజ్యాంగ ప్రతిష్టంభనలు రాజకీయ సమస్యలు పెద్ద ఆటంకం కావు.