కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ఇటీవల కాలంలో ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడను పొగడ్డం కొంచెం తగ్గించారని ఒక బిజెపి యువ నేతతో అన్నాను. మీలాటి వాళ్లంతా విమర్శలు చేస్తుంటే మా నాయకత్వం కూడా కాస్త తగ్గమని చెప్పినట్టుంది అని ఆయనన్నారు. అయితే నేనన్నది నిజం కాదని వెంకయ్య ఇంతలోనే నిరూపించారు. రాజధాని ప్రాంతంలోని నీరుకొండలో ఎస్ఆర్ఎం యూనివర్సిటీ శంకుస్థాపన వేడుకలో చంద్రబాబును మళ్లీ పొగిడేశారు. నవరత్న ఖచితంగా ఆయన అమరావతి నిర్మిస్తున్నారట! మామూలుగా కిరీటాలు సింహాసనాలు ఆభరణాలను రత్నఖచితమంటుంటారు. ఒక నగరాన్నే ఆ విధంగా అనరు. అయితేనేం భాషలో తిరుగులేని వెంకయ్య బావుంటుందని వాడేశారు. ఇటీవలనే శాసనసభను కొహినూర్ వజ్రం ఆకారంలో కట్టనున్నట్టు చంద్రబాబు చెప్పారు గనక కేంద్ర మంత్రి రత్నాలను ప్రస్తావించారన్నమాట. సరస్వతి వున్నదగ్గరకు లక్ష్మి వస్తుందన్నారు. వాస్తవం ఏమంటే లక్ష్మి వుంటేనే ముందు ఈ యూనివర్సిటీ సరస్వతి నిలయం ప్రవేశం కల్పిస్తుంది. ప్రైవేటు వర్సిటీలలో ర్యాంకింగులో వున్నా ఎస్ఆర్ఎం గ్రూపు చైర్మన్ టిఆర్ పచ్చముత్తు అనేక ఆరోపణలకు గురై జైలులో వుండి వచ్చారు. 2017 మేలో కూడా ఆయనకు ఒక చెక్ బౌన్స్ కేసులో స్టే ఇచ్చారే గాని ఎత్తివేయలేదు. ఇది సినిమా నిర్మాణానికి సంబంధించిన వ్యవహారమైతే నేరుగా విద్యార్థుల నుంచి 76 కోట్ల క్యాపిటేషన్ ఫీజు తీసుకుని సీటు ఇవ్వని కేసులు కూడా వున్నాయి. ఈయనకు ఇండియన్ జనయాగ కొచ్చి అనే పార్టీ కూడా వుంది. ఆ పార్టీతో తమ జాతీయ నాయకత్వం పొత్తు పెట్టుకోవడంపై బిజెపి రాష్ట్ర శాఖ ముఖ్యులు నిరసన తెలిపారు. ముత్తుకు రవాణా, సినీ వ్యాపారాలతో పాటు టీవీ నెట్వర్క్ కూడా వుంది. ఆ పార్టీలో ముఖ్యుడుగా వున్న మధన్ అన్న వ్యక్తి ఈ డబ్బులు తీసుకుని వుడాయించాడని, సినీ హడావుడి చేశాడని ముత్తు వాదిస్తారు గాని కోర్టులు ఆమోదించలేదు. మా క్యాంపస్లో విద్యారంగానికి సంబంధం లేని పనులు చేస్తున్నారని అధ్యాపకులు కూడా జాతీయ సాంకేతిక విద్యాసంస్థకు ఫిర్యాదు చేశారు. ఇవన్నీ జాతీయ మీడియాలోనే వచ్చాయి. అయినా చంద్రబాబు ప్రభుత్వం ఆఘమేఘాల మీద ఆ సంస్థ ఆరంభానికి హడావుడి చేస్తున్నది. వీటివల్ల అమరావతి ప్రపంచాన్నే శాసిస్తుందని చంద్రబాబు అనడం అతిశయానికి పరాకాష్ట.