తెలంగాణా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలని అన్నిటినీ తెరాస పార్టీ ఒక క్రమ పద్ధతి ప్రకారం నిర్వీర్యం చేస్తోంది కనుక వచ్చే ఎన్నికలలో బహుశః తెరాసకు వాటి నుండి గట్టి పోటీ ఉండకపోవచ్చును. ఒకవేళ పోటీ ఉన్నా అవలీలగా వాటిపై విజయం సాధించవచ్చును. కానీ ఆంద్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న తెదేపాకు మాత్రం అటువంటి అనుకూలమయిన పరిస్థితులు ఉండకపోవచ్చును. ఆంద్రప్రదేశ్ లో కేవలం వైకాపా నుండి మాత్రమే అది గట్టి పోటీ ఎదుర్కోవలసి ఉన్నప్పటికీ దానిపై విజయం సాధించడానికి చాలా కష్టపడవలసి ఉంటుంది.
గతేడాది జరిగిన ఎన్నికలలో వైకాపా కొద్దిపాటి తేడాతో ఓడిపోయింది. అప్పటి నుండి ఏదో ఒకరోజు తెదేపా ప్రభుత్వం కూలిపోవడం ఖాయమని తమ పార్టీయే అధికారంలోకి రావడం తధ్యమని వైకాపా చాలా నమ్మకంగా చెపుతోంది. ఒకవేళ దాని కలలు నెరవేరకపోయినా వచ్చే ఎన్నికలలో మాత్రం తన సర్వ శక్తులు ఒడ్డి విజయం కోసం పోరాడటం తధ్యం. ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా వైకాపా అధికారంలోకి రాలేకపోయినట్లయితే, వైకాపా చిన్నాభిన్నం అయిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని వినియోగించుకొంటూ తెదేపా ప్రభుత్వంపై తీవ్ర పోరాటాలు చేస్తున్నారు.
ఏదో ఒకనాడు తెదేపా పగ్గాలు, ఆ తరువాత ప్రభుత్వ పగ్గాలు కూడా చేప్పట్టబోయే నారా లోకేష్ జగన్ విసురుతున్న ఈ సవాళ్ళను ఎదుర్కొనవలసి ఉంటుంది. లోకేష్ రాజకీయ భవిష్యత్ తెదేపా భవిష్యత్ తతో ముడిపది ఉందని చెప్పవచ్చును. వచ్చే ఎన్నికలలో తెదేపా మళ్ళీ విజయం సాధించి అధికారంలోకి రాగాలిగితేనే లోకేష్ రాజకీయ భవిష్యత్ ఉజ్వలంగా ఉంటుంది. లేకుంటే జగన్, రాహుల్ గాంధీ భవిష్యత్ లాగే అయోమయంలో పడుతుంది. కనుక వచ్చే ఎన్నికలలోగా పార్టీని గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేసుకొని, పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై మరింత పట్టు సాధించవలసి ఉంటుంది. అందుకే ఆయన ఏడాదికి కనీసం లక్షమంది పార్టీ కార్యకర్తలతో సమావేశం అవ్వాలని నిర్ణయించుకొన్నారు. ప్రస్తుతం తెదేపాయే అధికారంలో ఉన్నప్పటికీ ఆయన అధికారం కోసం అర్రులు చాచకుండా పార్టీపై పూర్తి పట్టు సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ యువనేతలిరువురు తమదయిన శైలిలో తమ ముందున్న అన్ని అవకాశాలను వినియోగించుకొంటూ ముందుకు సాగుతున్నారు. కానీ వచ్చే ఎన్నికలక వీరిరువురిలో ఎవరు పైచేయి సాధించవచ్చు అంటే ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేము. కానీ ప్రస్తుతం తెదేపా అధికారంలో ఉంది కనుక నారా లోకేష్ కి అదనపు అడ్వాంటేజ్ అవుతుంది. అదే విధంగా రాజధాని నిర్మాణం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, రైల్వే జోన్ ఏర్పాటు, మెట్రో రైల్ నిర్మాణం, ఇతర హామీల అమలు చేయడంలో తెదేపా ప్రభుత్వం ఎంత వరకు సఫలం అవుతుందనే దానిపైనా తెదేపా, నారా లోకేష్ రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చును. ఒకవేళ తెదేపా ప్రభుత్వం వీటిలో విఫలమయినట్లయితే, అది జగన్ కి అడ్వాంటేజ్ గా మారుతుంది. తెదేపా పరిపాలనపై ప్రజలు సంతృప్తి చెందకపోయినట్లయితే, వచ్చే ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డికి అవకాశం ఇచ్చి చూద్దామని భావించినా ఆశ్చర్యం లేదు. కానీ జగన్ మెడపై సీబీఐ, ఈడీ కేసులు కత్తిలా వ్రేలాడుతున్నంత కాలం ఆయన రాజకీయ భవిష్యత్, ఆయనతో బాటు వైకాపా రాజకీయ భవిష్యత్ కూడా అనిశ్చితంగానే ఉంటుందని భావించవచ్చును.