భారతీయ జనతా పార్టీ విషయంలో వైసీపీ ధోరణి ఎలా మారుతోందో ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. తమకు తామే స్వయంగా స్పందించేసి ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థికి అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. అంతేకాదు, హైదరాబాద్ కి రామ్ నాథ్ కోవింద్ వస్తే.. వైసీపీ ప్రముఖులు పాదాభివందనాలు చేసేశారు! ఆ మధ్య ఢిల్లీ వెళ్లి మోడీని కలుసుకుని స్నేహాన్ని పెంచుకునే ప్రయత్నం చేశారు. ఇవన్నీ భాజపాతో దోస్తీ కోసం వైసీపీ వెంపర్లాట క్రమంలో చోటు చేసుకున్నవి. ఎప్పుడైతే భాజపాతో పొత్తు ప్రాధాన్యతను జగన్ గుర్తించారో.. అప్పట్నుంచీ కేంద్రంతో డీల్ చేసే వైఖరిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా, ప్రత్యేక హోదా పోరాట విషయంలో ఆ మార్పు మరింత బాగా కనిపిస్తోంది! అందుకు, తాజా సమావేశమే సాక్ష్యం!
రేపట్నుంచీ పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో సభలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీ ఎంపీలతో అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. విభజన చట్టంలో ఇచ్చిన అన్ని హామీలను కేంద్రం అమలు చేసే విధంగా ప్రయత్నించాలని ఎంపీలకు జగన్ సూచించారు. చేనేత, వస్త్ర, వ్యాపార రంగాలను వస్తు సేవల పన్ను (జీఎస్టీ) నుంచి మినహాయింపు ఇవ్వాలంటూ కేంద్రాన్ని కోరాలని అన్నారు. అలాగే, ప్రత్యేక హోదా సాధన దిశగా కూడా ప్రయత్నాలు చేస్తామన్నారు. హోదా కోసం లౌక్యం, దౌత్యం ఉపయోగించడం ద్వారా సాధించేందుకు కృషి చేయాలని ఎంపీలకు సూచించారు. ఈ సమావేశం అనంతరం విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తరువాత ప్రత్యేక హోదా అనేది చాలా ప్రధానమైన అంశంగా మారిందన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదా అవసరం అనేది తమ పార్టీ అధినేత జగన్ అభిప్రాయమని చెప్పారు. ప్రత్యేక హోదా కోసం తాము అన్ని విధాలుగా, పార్టీ అధ్యక్షుడు జగన్ చెప్పినట్టుగా ‘లౌక్యం, దౌత్యం’ ద్వారా ప్రయత్నాలు జరుగుతాయి అన్నారు.
ఈ మార్పు గమనించారా..? ప్రత్యేక హోదా కోసం ‘‘లౌక్యం, దౌత్యం’’ ద్వారా ప్రయత్నిస్తామని చెబుతున్న వైసీపీ వాయిస్ లో ఎంత సున్నిత్తత్వం వచ్చేసిందో…! ‘పోరాటం’ అనే మాట వాడితే ఢిల్లీ పెద్దలు హర్ట్ అయిపోతారేమో అన్నట్టుగా.. ఆ పదం జోలికి వెళ్లకుండా హోదా కోసం కృషి అంటున్నారు. గతంలో హోదా కోసం ‘పోరాటం’ అనేవారు, ఇప్పుడు హోదా కోసం ‘కృషి’ చేస్తామంటున్నారు! ప్రయత్నం ఏరూపంలో ప్రశంసించాల్సిందే. కానీ, గడచిన మూడేళ్లలో ఈ లౌక్యం, దౌత్యం ఏమయ్యాయి..? ఇప్పుడే ఎందుకు గుర్తొచ్చాయి..? ప్రత్యేక హోదా కోసం అవసరమైతే ఎంపీలు రాజీనామాలు చేస్తారని చాలాసార్లు బహిరంగ సభల్లో చెప్పారు కదా! తాజా సమావేశంలో ఆ టాపిక్ ఎందుకు ప్రస్థావనకు రాలేదు..? హోదా ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తం చేస్తామని చెప్పిన గతం ఏమైంది..? వైకాపా అధికారంలోకి వస్తేనే హోదా సాధ్యమని చెప్పిన హామీలు ఏమయ్యాయి..? అన్నిటికీ మించి.. మొన్నటికి మొన్న ప్లీనరీలో ప్రకటించిన 9 హామీల్లో ప్రత్యేక హోదా టాపిక్ ఎందుకు లేదు..?
మరోసారి అదే మాట చెప్పుకోవాల్సి వస్తోంది.. ప్రత్యేక హోదా అనేది కేవలం ఒక డిస్కషన్ మెటీరియల్! రాజకీయ ప్రయోజనం కోసం దాన్ని ఎవరికి నచ్చినట్టు వారు మార్చుకోవచ్చు. ఇప్పుడు భాజపాతో వైపీసీకి దోస్తీ కావాలి, ఢిల్లీ పెద్దల్ని ప్రసన్నం చేసుకోవాలి. కాబట్టి, కేంద్రం మనో భావాలు దెబ్బతినకుండా.. అలాగని రాష్ట్ర ప్రయోజనాలను వదిలేస్తున్నారన్న విమర్శలకూ దొరక్కకుండా… మధ్యే మార్గంగా లౌక్యం, దౌత్యం ద్వారా హోదా సాధించుకుని వస్తారట! సో… ఇకపై హోదా విషయంలో వైసీపీ కూడా కేంద్రం ముందు ధీటుగా మాట్లాడలేదని అనిపిస్తోంది..!