వైసీపీ పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పార్టీ మారబోతున్నారా..? అధికార పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమౌతున్నారా..? బుట్టా అనుచరులు కూడా వైసీపీని వీడాలని పట్టుబడుతున్నారా..? ఇప్పుడు చర్చనీయంగా మారిన అంశాలు ఇవే. తాజాగా ఆమె ఏపీ మంత్రులు నారా లోకేష్, నారాయణలను కలుసుకోవడంతోనే ఈ విశ్లేషణలన్నీ వినిపిస్తున్నాయి. శుక్రవారం నాడు కర్నూలు జిల్లా పర్యటనకు వచ్చిన టీడీపీ మంత్రులను వైసీపీ ఎంపీ రేణుక కలుసుకున్నారు. అయితే, జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల విషయమై చర్చించేందుకు మాత్రమే రేణుక వారిని కలిశారనీ, అంతేతప్ప దీన్లో వేరే రాజకీయ కోణం ఏదీ లేదంటూ వైసీపీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అంటున్నారు. ఆమె పార్టీ మారతారంటూ జరుగుతున్న ప్రచారం కూడా సరైందని కాదని ఆయన కొట్టిపారేశారు.
సరే… మేకపాటి ఇలా రేణుకను వెనకేసుకొస్తున్నా, శనివారం జరిగిన వైసీపీ ఎంపీల సమావేశానికి ఆమె హాజరు కాలేదు! జగన్మోహన్ రెడ్డి అధ్యక్షత జరిగిన ఈ భేటీకి ఆమె రాకపోవడం ఇప్పుడు చర్చనీయం అవుతోంది. అసలే భాజపాకి వైసీపీ దగ్గరౌతున్న తరుణమిది. ఇలాంటి సమయంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు మొదలౌతున్నాయి. దీంతో పార్టీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహాన్ని చర్చించుకునే కొలువైన ఈ కీలక సమావేశానికి రేణుక రాకపోవడం ఆశ్చర్యమే! ఆమె గైర్హాజరీపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. మంత్రి నారాయణ, మరో మంత్రి నారా లోకేష్ లను ఆమె కలవడం అంశం కూడా ప్రస్థావనకి వచ్చినట్టు తెలుస్తోంది. టీడీపీ నేతలతో ఇలా కలిసిమెలిసి తిరిగితే కార్యకర్తలకు ఎలాంటి సందేశం ఇచ్చినట్టు అంటూ జగన్ ఆగ్రహించారట! ఎంపీల సమావేశానికి బుట్టా రేణుక రాకపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్లమెంటులో ప్రత్యేక హోదా వంటి కీలక అంశాలు ప్రస్థావనకు రానున్న నేపథ్యంలో ఎంపీలందరూ బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. అంతేకాదు, పార్టీ ఎంపీలు ఎవరైనాసరే నియమ నిబంధనలు పాటించాల్సి ఉంటుందనీ, క్రమశిక్షణ అవసరమంటూ ఆగ్రహించినట్టు తెలుస్తోంది.
బుట్టా రేణుక తెలుగుదేశంలో చేరతారో లేదో అనేది అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. ఈ విషయమై ఆమె స్వయంగా స్పందించిందీ లేదు. కానీ, ఆమె వైకాపాకి దూరమౌతున్నట్టుగా పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కనిపిస్తున్నాయి. ఆమె తీరుపై అధినేత జగన్ అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు అలానే ఉంది. అసలే ఇది జంప్ జిలానీల కాలం! ఈ మధ్యనే అదే జిల్లాకు చెందిన శిల్పా మోహన్ రెడ్డి టీడీపీని వీడి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశం అయింది. సో.. ఇప్పుడు బుట్టా రేణుక టీడీపీలోకి రావడం ఖాయమైతే మరో కీలక రాజకీయ పరిణామమే అవుతుంది.