సంచలనం కలిగిస్తున్న మత్తుపదార్థాల కేసులో రకరకాల వూహాగానాల మధ్య ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి సమీక్ష జరిపినట్టు వార్తలు వచ్చాయి. గుడుంబా విషయంలో వలెనే ఇక్కడా కఠినంగా వ్యవహరించాలని, ఆఖరుకు మంత్రులూ టిఆర్ఎస్ నేతలనైనా ఉపేక్షించవద్దని ఆయన చెప్పినట్టు చెబుతున్నారు. ఇదంతా బాగానే వుంది గాని గతంలో ఇలాగే ఆయన గట్టిగా చెప్పిన కేసులు గట్టుదాటిన దాఖలాలు లేవు. నయీం కేసు, మియాపూర్ తదితర భూకబ్టాలలోనూ ఇంతకంటే తీవ్రంగా హెచ్చరికలు వచ్చాయి.కాని ఆచరణలో మాత్రం బలమైన ఒక్క నాయకుణ్ని లేదా ప్రముఖుణ్ని పట్టుకున్న బయిటపెట్టిన ఉదాహరణ లేదు. నయీం కేసులోనైతే ఏ రాజకీయ వాదిపై చర్య తీసుకోబోమని టిఆర్ఎస్వారు ముందు నుంచే చెబుతూ వచ్చారు. జరిగిందీ అంతకన్నా భిన్నంగా లేదు. భూ కుంభకోణం చర్యలు కూడా అధికారులకు లేదా టిడిపి నేతలకు పరిమితమైనాయి. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారి పేర్లు చెప్పి వారిని అంతిమంగా కాపాడటమే జరిగింది. ఇప్పుడు కూడా కొందరు ఘనాపాటీల పేర్లు వచ్చిన నేపథ్యంలో కెసిఆర్ సమగ్రంగా చాకచక్యంగా వెళ్లాలని నిర్దేశకాలు ఇస్తారే తప్ప దూకుడుగా చర్యలకు పాల్పడమని చెప్పరు. ఎందుకంటే నోరున్న వాళ్లనూ బలమున్న వాళ్లనూ కనుసన్నల్లో అట్టిపెట్టుకోవాలని అవసరమైతే అందుకు పట్టువిడుపులు చూపింఎచాలని ఆయన భావిస్తుంటారు. ఆయన చెప్పిన ఫక్తు రాజకీయ పార్టీ లక్షణాలలో అవన్నీ వుంటాయి. అకున్ సబర్వాల్ గతంలోనూ అనేక బలమైన ఆపరేషన్లు చేసిన వ్యక్తి. ఆయన భార్య స్మితా సబర్వాల్ సిఎం కార్యాలయంలో అత్యంత శక్తివంతమైన అధికారిణి కూడా. కనుక అలాటి అకున్పై మరెవరో ఒత్తిడి తేవడం కుదిరేపని కాదు గాని ఆచితూచి అడుగేయాలని అధినేతే చెప్పగలరు. ఆయనను సెలవుపై పంపారన్న కథనాలు బలంగా ఖండించకపోతే విశ్వసనీయత దెబ్బతింటుంది గనకే సిఎం తెరపైకి వచ్చారు. అంతే. ఇక కేసు నడక కేసుదే.