కేంద్రమంత్రి వెంకయ్య నాయుడుని ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశాలున్నట్టుగా కథనాలు చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నట్టు ఓ ప్రముఖ మీడియా సంస్థ కథనం ప్రచురించింది! దాని సారాంశం ఏంటంటే… కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఉప రాష్ట్రపతి కాకుండా, కేంద్రంలోనే మంత్రిగా అందుబాటులో ఉండాలని! ఒకవేళ ఉపరాష్ట్రపతిగా వెళ్తే ఆంధ్రాని కేంద్రంలో పట్టించుకునే నాథుడు కరువు అవుతారని! తెలుగుదేశం పార్టీలోని కొంతమంది మంత్రులూ, ఎంపీలలో ఈ తరహా ఆందోళన వ్యక్తమౌతోందని ఆ కథనంలో పేర్కొన్నారు.
కేంద్రమంత్రి వెంకయ్యకి ఉప రాష్ట్రపతి పదవి ఇస్తే.. తదనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే అంశమై తెలుగుదేశంలో తర్జనభర్జన మొదలైందట. కేంద్రంలో ఆంధ్రా తరఫున బలమైన వాయిస్ వినిపించడంలో వెంకయ్య ముందుంటారనీ, 2014లో భాజపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచీ చాలా సందర్భాల్లో ఆంధ్రా వాణిని ఆయన బలంగా వినిపిస్తున్నారని టీడీపీ నేతలు ఇప్పుడు చర్చించుకుంటున్నారట. రాష్ట్ర విభజన తరువాత కేంద్రం నుంచి రావాల్సిన ఎన్నో ప్రయోజనాల అంశమై వెంకయ్యే నిరంతరం పోరాడుతూ వచ్చారనీ, కేంద్రాన్ని ఏం కోరాలన్నా అక్కడ వెంకయ్య నాయుడు ఉన్నారే ధీమా ఆంధ్రా నేతలకి ఉందనీ, ఒకవేళ ఆయన ఉప రాష్ట్రపతి అయితే ఆ అవకాశం తమకు లేకుండా పోతుందని టీడీపీ ఆవేదన చెందుతోందట. ‘ఏదైనా ఒక సమస్యతో ఢిల్లీకి వెళ్తే ఆయన స్పందిస్తారనే భరోసా ఇప్పుడు ఉంది. ఆయన ఉప రాష్ట్రపతి అయితే, ఆ హోదా కేవలం ఆంధ్రా ప్రయోజనాల కోసం అతిగా చొరవ తీసుకోవడం కుదరని పని అవుతుంది. ఏపీ విషయంలో గతంలో ఉన్నంతగా క్రియాశీలంగా ఆయన ఉండలేర’ని ఒక టీడీపీ ఎంపీ అభిప్రాయపడ్డట్టు కథనం. ‘ఒక తెలుగువాడికి అంత పెద్ద పదవి దక్కితే కచ్చితంగా సంతోషించాల్సిన విషయమే. కానీ, ఆయన అవసరం రాష్ట్రానికి చాలా ఉందనే విషయం గుర్తుకొస్తేనే ఆందోళనగా ఉంటూ ఏపీ మంత్రి ఒకాయన పార్టీ వర్గాల్లో ఆఫ్ ద రికార్డ్ అభిప్రాయపడ్డారట!
సూటిగా చెప్పాలంటే… ఇదంతా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవేదనగా కనిపిస్తోంది! మంత్రులు, ఎంపీలు వ్యక్తం చేస్తున్న ఆవేదన చంద్రబాబుది అనడంలో సందేహం లేదు. ఎందుకంటే, కేంద్రంలో వెంకయ్య నాయుడు క్రియాశీలంగా ఉన్నంత వరకూ భాజపాతో దోస్తీ సక్రమంగా సాగుతుందనేది చంద్రబాబుకు బాగా తెలుసు! అంతేకాదు, వెంకయ్య కేంద్రంలో ఉంటేనే చంద్రబాబుకు కొన్ని సమస్యల ఉండవు అనేది ఓపెన్ సీక్రెట్. కేంద్ర ప్రభుత్వంలో వెంకయ్య నాయుడు లేకపోతే… చంద్రబాబుకు ఇప్పుడున్న ప్రాధాన్యత ఉండదని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు ప్రయోజనాల కోసం బాగా ఆలోచించే ఆ పత్రిక కథనంలోని ఆంతర్యం, ఆవేదనా ఇదే..!