ఉపరాష్ట్రపతిగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్య నాయుడు పేరును బిజెపి అద్యక్షుడు అమిత్ షా ప్రకటించడంపై తెలుగు రాష్ట్రాల నేతలు హర్షం ప్రకటిస్తున్నారు గాని ఆయనలో పెద్ద సంతోషం కనిపించడం లేదు. ఎందుకంటే క్రియాశీల రాజకీయ జీవితం ప్రత్యక్ష పాత్ర ఇక ముగిసిపోవలసిందే. రాష్ట్రపతి పదవైనా రాజ్యాంగ పాత్ర వుంటుంది గాని ఉపరాష్ట్రపతి ప్రధానంగా అలంకారప్రాయమే. వెంకయ్యతో ఎప్పుడూ పెద్ద అన్యోన్న సంబంధాలు లేని ప్రధాని మోడీ ఉద్ధేశ పూర్వకంగానే ఈ నిర్ణయం తీసుకున్నారట. దక్షిణాదిన విస్తరించాలనుకునే బిజెపి అక్కడ పెద్దదిక్కుగా చెప్పుకునే ఆయనను రంగం నుంచి తప్పించడంలో చాలా ఆంతర్యం వుంది. ఇక మీదట అమిత్ షా స్వేచ్చగా నిర్ణయాలు తీసుకోవచ్చు. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టు కూడా తగ్గించవచ్చు. ఆ పదవిలో వుంటే వెంకయ్య నాయుడు నిస్సహాయుడై పోతారని కాదు గాని పరిమితులు చాలా వుంటాయి. అందుకే ఆయన బహిరంగంగానే అయిష్టత వెలిబుచ్చారు.ఎవరైనా ఒత్తిడి తెచ్చినా ఒప్పుకోబోనన్నారు. కాని అదే జరిగింది. ఉపరాష్ట్రపతులుగా చేసిన అనేక మంది రాష్ట్రపతులైనారు గాని అదేమీ గ్యారంటీ కాదు. బిజెపి తరపున పనిచేసిన బైరాన్ సింగ్ షెకావత్ కాలేకపోయారు. అయిదేళ్ల తర్వాత రాజకీయాలేమిటి, అప్పుడు నిర్ణేతలెవరు అన్నది వూహకందేది కాదు. రాజ్యసభ నిర్వహణకోసం అన్నది కూడా నిజం కాదు. నిష్పక్షపాతంగా నడపాలని చెప్పే చోట ఒక పరిమితికి మించి ఎవరైనా చేసేది వుండదు. పైగా వైస్ చైర్మన్ కూడా వుంటారు. కాబట్టి ఇది ఇంగ్లీషులో చెప్పే కికింగ్ అప్స్టియర్స్ మాత్రమే.