వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు ఏ రేంజిలో ఉంటాయో అందరికీ తెలిసినవే. టీడీపీపై ఎప్పడికప్పుడు విరుచుకుపడుతూనే ఉంటారు! అయితే, ఈ ధోరణి వల్లనే ఇప్పుడు మరోసారి చిక్కుల్లో పడబోతున్నట్టు చెప్పాలి. వైకాపా ఎమ్మెల్యే రోజాకు మరోసారి నోటీసులు జారీ చేసేందుకు రంగం సిద్ధమైంది! నిజానికి, గతంలో అసెంబ్లీలో ఆమె వ్యవహరించిన తీరు అభ్యంతరకరంగా ఉందనీ, ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ఆమె చేసి కామెంట్స్ సరిగా లేవంటూ సభ నుంచీ ఏడాది పాటు వేటు వేశారు. ఆ తరువాత, వ్యవహారం కోర్టు కెక్కింది. ఆ నిషేధ కాలం పూర్తి చేసుకుని రోజా ఈ మధ్యనే సభలకు రావడం మొదలుపెట్టారు. అయితే, ఇప్పుడు ఆమె అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై అనునచిత వ్యాఖ్యలు చేశారన్నది తాజా నోటీసులకు కారణం అయింది.
రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా అమరావతిలో అధికార పార్టీ మాక్ పోలింగ్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి స్పీకర్ కోడెల కూడా వచ్చారు. అయితే, ఆయన రాకను ఎమ్మెల్యే రోజా తీవ్రంగా తప్పుబట్టారు. స్పీకర్ వ్యవస్థతోపాటు, ఆ స్థానానికి ఉన్న గౌరవాన్ని దిగజార్చే విధంగా కోడెల వ్యవహరించారంటూ ఆమె విమర్శించారు. సభాపతి స్థానంలో ఉన్న వ్యక్తి, ఇలా పార్టీ నేతలతో వచ్చి ఓటింగ్ చేయడం సరికాదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించడం బాధాకరమనీ, గతంలో మాదిరిగానే తమను శాసన సభలో ఎక్కడ తొక్కేస్తారేమో అనే ఆందోళన కలుగుతోందని రోజా అన్నారు. స్పీకర్ బయట కార్యక్రమాల్లో పాల్గొంటున్న సమయంలో కూడా పార్టీ కండువాలు వేసుకుంటారనీ, పార్టీ క్యాబినెట్ మీటింగుల్లో పాల్గొంటారనీ, ఈరోజు మాక్ ఎన్నిక సమయంలో ఇతర టీడీపీ ఎమ్మెల్యేలతో రావడం కరెక్ట్ కాదని విమర్శించారు. ఇలా దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయడమనేది సరికాదని రోజా అన్నారు.
అసెంబ్లీ ప్రాంగణంలో స్పీకర్ ను ఉద్దేశించి రోజా చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయంటూ ఆమెకి నోటీసులు పంపారు. ఏ నేపథ్యంలో రోజా ఇలా మాట్లాడారు, ఎందుకు మాట్లాడారనే అంశాలపై వివరణ కోరుతూ ఈ నోటీసులు జారీ అయ్యాయి. ఇక, మాక్ పోలింగ్ కు స్పీకర్ కోడెల రావడంపై టీడీపి వర్గాల స్పందన ఏంటంటే… పోలింగ్ విధానాన్ని పర్యవేక్షించేందుకే ఆయన వచ్చారనీ, పోలింగ్ లో ఆయన పాల్గొనలేదని చెబుతున్నారు. ఉద్దేశపూర్వంగానే స్పీకర్ ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేశారంటూ రోజాని తప్పబడుతున్నారు. స్పీకర్ పై విమర్శలు చేయడం రోజాకీ, వైకాపాకీ అలవాటైన పనే అంటూ ఎద్దేవా చేస్తున్నారు. అయితే, మాక్ పోలింగ్ లో కోడెల పాల్గొన్నట్టుగా తమ దగ్గర ఫొటోలూ వీడియో ఆధారాలు ఉన్నాయంటూ వైసీపీ చెబుతోంది. ఏదేమైనా, ఈ వివాదం మరోసారి పొలిటికల్ హీట్ పెంచే అవకాశం ఉంది. వ్యవహారం మళ్లీ నోటీసుల వరకూ వెళ్లడంపై రోజా వివరణ ఇచ్చే క్రమం ఎలా ఉంటుందో చూడాలి.