ఈ మధ్యనే జరిగిన వైసీపీ ప్లీనరీని ఒక్కసారి గుర్తు చేసుకుందాం! గుంటూరులో జరిగిన ప్లీనరీలో 2019 ఎన్నికల మ్యానిఫెస్టోని ప్రతిపక్ష నేత జగన్మోన్ రెడ్డి ప్రకటించేశారు. త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేస్తానంటూ ఓ తొమ్మిది హామీలను ఇచ్చారు! వాటిని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ వర్గాలకు పిలుపునిచ్చారు. మిగతా హామీలు ఎలా ఉన్నా… వాటిలో కాస్త ఆకర్షణీయంగా నిలిచింది మద్య నిషేధం! తాము అధికారంలోకి వచ్చాక మూడు దశల్లో మద్య నిషేధం అమలు చేస్తానని జగన్ చెప్పారు. మిగతా ఎనిమిది హామీల్లో ఇప్పటికే టీడీపీ సర్కారు కొన్ని అమలు చేస్తోంది. ఈ మద్య నిషేధ హామీ మాత్రం ఎన్నికల్లో కీలకాంశంగా మారే అవకాశం ఉందనే విశ్లేషకులు భావించారు. అయితే, జగన్ ఇచ్చిన ఈ హామీలో తొలిదశను అమలు చేయడం మొదలుపెట్టేశారు సీఎం చంద్రబాబు!
ఇప్పుడు ఇదే అంశంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించడం విశేషం! రాష్ట్రంలో బెల్టు షాపుల్ని సమూలంగా తొలగిస్తామంటూ సీఎం ప్రకటించారు. ఉన్నట్టుండీ ఈ నిర్ణయం ఏంటంటే… ప్రభుత్వం ఓ సర్వే నిర్వహించిందనీ, బెల్టు షాపుల్ని తొలగించాలంటూ మహిళలు కోరుతున్నట్టు తేలిందని చంద్రబాబు చెప్పారు. అందుకే, మహిళల అభిప్రాయాలను గౌరవిస్తూ చర్యలు తీసుకుంటున్నామని, ఈ నెలాఖరులోగా బెల్టు షాపులు కనిపించకూడదనీ, ఆ తరువాత కూడా మూసెయ్యకపోతే ఎంతటి వారిపైన అయినా కఠిన చర్యలు ఉంటాయని చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం చేపడుతున్న వివిధ కార్యక్రమాల తీరుపై సర్వే నిర్వహిస్తుంటే, బెల్టు షాపుల విషయం ప్రధానంగా ప్రస్థావనకి వచ్చిందనీ, దానిపై కూడా సర్వే చేయిస్తే మహిళల అభిప్రాయం తెలిసిందని చెప్పుకొచ్చారు.
నిజానికి, ఈ మధ్య మద్యం దుకాణాల అంశమే చర్చనీయంగా మారిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రహదారులకు దూరంగా దుకాణాలు ఉండాలన్న నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు. దాంతో కొన్ని దుకాణాలు జనావాసాల్లోకి వెళ్లాయి. చాలాచోట్ల తిరుగుబాట్లూ వచ్చాయి. సరిగ్గా ఇదే నేపథ్యంలో దశల వారీ సంపూర్ణ మద్య నిషేధం చేస్తామంటూ జగన్ హామీ ఇచ్చారు. అయితే, ప్లీనరీలో జగన్ ఇచ్చిన 9 హామీలపైనా టీడీపీలో లోతైన చర్చ జరిగిందనీ కథనాలు వినిపించాయి. వాటిల్లో కీలక అంశం ఇదేననీ, ఈ ఇష్యూని వైకాపాని అనుకూలంగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని కొంతమంది ప్రముఖ నేతలు చంద్రబాబు ముందు వినిపించారనీ అంటున్నారు! అందుకే, సర్వే పేరుతో ఇప్పుడీ చర్యలకు దిగారు. సంపూర్ణ మద్య నిషేధం వరకూ టీడీపీ సర్కారు వెళ్లకపోయినా… బెల్టు షాపుల్ని తీసేస్తే మహిళల అభిమానాన్ని చూరగొనే అవకాశమైతే ఉందనే చెప్పాలి. రాజకీయాంశాలను పక్కన పెడితే.. బెల్టు షాపుల్ని తొలగించడం అనేది మంచి నిర్ణయమే అనాలి.