అగ్ర కథానాయకులు, అగ్ర నాయికలు ఉన్నట్టే.. అగ్ర దర్శకులంటూ ఓ జాబితా ఉంది. రాజమౌళి, వినాయక్, పూరి జగన్నాథ్, త్రివిక్రమ్, సుకుమార్, బోయపాటిశ్రీను, కొరటాల శివ… వీళ్లంతా అగ్ర దర్శకులే. ఈ లీగ్‌లోకి చేరితే చాలు. సినిమాకి రూ.8 నుంచి రూ.10 కోట్లు ఈజీగా సంపాదించేయొచ్చు. అయితే.. స్థానం అంత తేలిగ్గా రాదు. స్టార్ హీరోలతో సినిమాలు చేయాలి, వాళ్లతో హిట్లు కొట్టాలి. ఈ జాబితాలో చేరడానికి సంపత్ నంది కూడా ఉవ్వీళ్లూరుతున్నాడిప్పుడు. ఏమైంది ఈ వేళతో తొలి హిట్ కొట్టిన సంపత్.. ఆ తరవాత రచ్చ, బెంగాల్ టైగర్ సినిమాలతో కమర్షియల్ దర్శకుడు అనిపించుకొన్నాడు. ఇప్పుడు గౌతమ్ నంద రూపొందించాడు. గోపీచంద్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఈనెల 28న విడుదల అవుతోంది. సినిమా చూసినవాళ్లంతా ‘పాయింట్ భలే బాగుంది..’ అంటున్నార్ట. ఈ సినిమాపై గోపీచంద్ కూడా చాలా నమ్మకాలు పెట్టుకొన్నాడు.
ఈమధ్య గోపీ సినిమా… విడుదలకు ముందే టేబుల్ ప్రాఫిట్ దక్కించుకోవడం చాలా అరుదుగా మారింది. గౌతమ్ నంద.. ఆ ఫీట్ చేసేసింది. విడుదలకు ముందే నిర్మాతలకు లాభాలు చూపించింది. అవుట్‌పుట్‌పై చిత్రబృందం సంతృప్తిగా ఉంది. ”గోపీచంద్ కంటే పెద్ద హీరో ఉంటే.. ఈసినిమా స్థాయి ఇంకోలా ఉండేది” అంటూ కామెంట్లు వినిపించడం మొదలెట్టాయి. ఈ సినిమా విడుదలయ్యాక పెద్ద హీరోలు తనని పని గట్టుకొని పిలుస్తారని సంపత్ భావిస్తున్నాడు. గౌతమ్ నంద గనుక హిట్ అనిపించుకొంటే.. సంపత్ ఆశలు నెరవేరడం ఖాయం. మరి గౌతమ్ నంద ఏం చేస్తాడో..??