ఫిరాయింపుదారులపై చర్యలు ఉంటాయీ ఉంటాయీ అంటూ ఏళ్లు గడిచిపోతున్నాయి! మరో ఏడాదిన్నర దాటేస్తే ఏకంగా ఎన్నికలే వచ్చేస్తాయి. ఈలోగా జంప్ జిలానీలపై చర్యలు ఉంటాయా అనే అనుమానాలు చాలామందిలో ఉన్నాయి. అయితే, తాజాగా ఇదే అంశంపై హైకోర్టు స్పందించింది. ఏపీకి చెందిన నలుగురు మంత్రులకు మంగళవారం నాడు హైకోర్టు నోటీసులు జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. వైకాపా టిక్కెట్ పై గెలిచి, తెలుగుదేశంలో చేరినవారిలో ఓ నలుగురికి సీఎం చంద్రబాబు మంత్రి పదవులు కట్టబెట్టిన సంగతి తెలిసిందే. వారితో రాజీనామాలు చేయించాలనే ఊసే ఇంతవరకూ చర్చకు రావడం లేదు. జంప్ జిలానీలను మంత్రి పదవుల నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటీషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. పార్టీ ఫిరాయించడం, రాజీనామాలు చెయ్యకుండా మంత్రి పదవులు అనుభవిస్తూ ఉండటం చట్ట విరుద్ధం అంటూ పాత్రికేయుడు శివప్రసాద్ రెడ్డి హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై స్పందించిన కోర్టు.. నలుగురు మంత్రులకూ నోటీసులు జారీ చేసింది. వారికి నాలుగు వారాలు గడువు ఇచ్చి, ఈలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
వైసీపీ నుంచి ఎన్నికై, టీడీపీ తీర్థం పుచ్చుకున్నవారిలో అమర్ నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ్ కృష్ణ రంగా, భూమా అఖిల ప్రియ ఏపీలో మంత్రులుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వీరితోపాటు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కేసును కూడా ఇదే కేసుతో విచారిస్తామని కోర్టు తెలిపింది. తలసాని కూడా టీడీపీ బీఫామ్ మీద ఎమ్మెల్యేగా గెలిచినవారే. ఆ తరువాత, తెరాస తీర్థం పుచ్చుకుని, కేసీఆర్ క్యాబినెట్ లో మంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన కేసును కూడా ఏపీ ఫిరాయింపు మంత్రులతో కలిపి విచారిస్తామని న్యాయస్థానం చెప్పడంతో ఆసక్తికరంగా మారింది.
తాజా నోటీసుల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల అధికార పార్టీలకు టెన్షన్ మొదలైందని చెప్పాలి. ఫిరాయింపుదారులపై కోర్టు తీర్పు ఏవిధంగా ఉంటుందనే చర్చ రెండు రాష్ట్రాల అధికార పార్టీ వర్గాల్లోనూ ప్రారంభమైనట్టు తెలుస్తోంది. తీర్పు సంగతి ఎలా ఉన్నా… ఫిరాయింపుల్ని ప్రోత్సహించడం అనేది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఆ పనిని అధికారంలో ఉన్న పార్టీలు చేయడం మరీ దారుణం. ప్రతిపక్షాలను అణచివేయడం కోసం ఫిరాయింపులను ప్రోత్సహించొచ్చు అనే ఒక రాజకీయ దుస్సాంప్రదాయానికి తెరాస, టీడీపీలు బీజం వేశాయి! దీన్ని కూకటివేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఫిరాయింపుల ఆలోచనే పార్టీలకుగానీ, నేతలకుగానీ రాకుండా ఉండేలా చర్యలు ఉండాలనే అభిప్రాయం సామాన్యుల నుంచీ ఎప్పట్నుంచో వ్యక్తమౌతూనే ఉంది.