చైనా లో ఆర్ధిక సంక్షోభ ప్రభావం భారత్ లో మొదటిసారిగా వజ్రాల పాలిషింగ్ పరిశ్రమ మీదపడింది. అయితే చైనా మాంద్యంలో భారత్ కు ప్రయోజనాలు కూడా ఎక్కువే. ఉదాహరణకు నిర్మాణ రంగానికి ఉక్కు సిమెంటులను చౌకగా దిగుమతి చేసుకోడానికి ఇది మంచి సమయమే అవుతుంది. ఆభరణాల్లో పొదగడానికి వీలుగా వజ్రాలను సానబట్టి క్వాలిటీ ప్రకారం, క్వాంటిటీ ప్రకారం వేరుచేసే పరిశ్రమకు గుజరాత్ లోని సూరత్ కేంద్రం. ఇక్కడినుంచి ఏటా 2200 కోట్ల డాలర్ల విలువగల పాలిష్డ్ వజా్రలు ఎగుమతి అవుతూంటాయి. ఈమార్కెట్ లో చైనా వ్యాపారుల వాటా 20 శాతం వరకూ వుంది. చైనాలో మాంద్యం రోడ్డున పడకముందే సూరత్ లో డైమండ్ పాలిషింగ్ పరిశ్రమ ఆ మాంద్యాన్ని గుర్తించింది. చైనా వ్యాపారుల బకాయులు పేరుకుపోవడం, వజ్రాల ఎగుమతులు మందగించడం కొంతకాలంగా జరుగుతూనే వుంది. ఫలితంగా సూరత్ లో సూరత్ లో ఐదు చిన్న, మధ్య తరహా వజ్రాల పాలిషింగ్ కంపెనీలు మూతపడ్డాయి. సూరత్ లో వజ్రాల పాలిషింగ్ కంపెనీలు రెండేళ్ళక్రితం తమ వద్దపనిచేసే నిపుణులు, ఉద్యోగులకు కార్లు, అపార్ట్మెంట్లు, ఆభరణాల వంటి బోనస్ లిచ్చి ప్రోత్సహించాయి. ఇపుడు అటువంటి ప్రోత్సాహకాలు ఏమీ లేవు.
సరిహద్దు ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, భారత్‌కు ఉన్న పెద్ద వాణిజ్య భాగస్వామి చైనాయే. రాజకీయ తిరస్కారాలకంటే ఆర్ధిక అనివార్యలే బలీయమైనవి. ఏటా 65 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చైనా నుంచి భారత్‌కు వస్తున్నాయి. అయితే అక్కడికి జరుగుతున్న ఎగుమతుల విలువ 16 బిలియన్ డాలర్లు మాత్రమే. చైనా 2011, 2012 సంవత్సరాలలో చేసిన సిమెంట్ ఉత్పత్తి, 20వ శతాబ్దం మొత్తం అమెరికా చేసిన సిమెంట్ ఉత్పత్తి కంటే ఎక్కువ. చైనా ఏటా 850 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేస్తుంది. భారత్ ఉత్పత్తి 80 మిలియన్ టన్నులు మాత్రమే. చైనాలో ఆర్థిక క్షీణత వల్ల చాలా దేశాలు తమ భవిష్యత్తును గురించి ఆందోళన పడడం మొదలు పెట్టాయంటే, ప్రపంచంలో చైనా ఆర్ధిక వ్యవస్థగా ఎంత అనివార్యమైనదో
గడచిన ఆరు దశాబ్దాలుగా చైనా ఆర్థిక వ్యవహారాలకు మించి అనేక విధాలుగా భారత్‌ను ఇబ్బందులకు గురి చేసింది.భారత్‌ను పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లకు పలు సందర్భాలలో మద్దతు ఇచ్చి ఇరకాటంలో పెట్టింది.అణ్వాయుధాలను అభివృద్ధి చేసుకోవడానికి పాకిస్తాన్‌కు సాయంచేసింది. ఈ నేపథ్యంలో చైనా ఆర్థిక వ్యవస్థలో క్షీణత భారత్‌కు ఏ విధంగా ఉపకరించగలదన్నదే ప్రశ్న. చైనా ఆర్థిక వ్యవస్థ మందగించడం వల్ల చమురు, బొగ్గు, రాగి, జింక్ వంటి వాటి ధరలు దిగివస్తాయి. గతంలో ప్రపంచంలో అధిక మొత్తంలో చమురు నిల్వలను కొనుగోలు చేసిన చైనా ఇప్పుడు వెనకబడుతోంది. దీనితో చమురు మార్కె ట్ పతనమవుతుంది. చైనా ఆర్థిక మందగమనం భారత్‌కు ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్ పతనానికి దారి తీసిన సంక్షోభం నుంచి బయటపడడానికి చైనా తన కరెన్సీ విలువను తగ్గించింది. దీనితో ఆ దేశం నుంచి జరిగే ఎగుమతులు చౌక అవుతాయి. మునుపెన్నడూ లేనట్టు చైనా ఉక్కు, సిమెంట్ ధరలు 25 శాతం తగ్గడం గమనించాలి. నిర్మాణ వ్యయం 25 శాతం తగ్గితే భారత్ లాభపడుతుంది.
గత ఏడాది చైనా కు 300 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు అందాయి . చైనా ఆర్థికవ్యవస్థ బలహీనపడితే విదేశీ పెట్టుబడులు ఇండియా వైపు మరలే అవకాశం వుంది. పలు చైనా కంపెనీలు కూడా ఇండియా వైపు చూస్తాయి. ఇందుకు మంచి ఉదాహరణ- ఫాక్స్కూన్. ఇది ఇండియాలో పది ఫ్యాక్టరీలను నెలకొల్పింది. ఏపిల్ ఫోన్లు, ఐపాడ్ల ఉత్పత్తిలో దీనిదే ప్రధాన పాత్ర. వీటిలో 2 లక్షల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగాలు వచ్చాయి. ఇలాంటి తక్షణ లాభాలు భారత్‌కు సమకూరతాయి. చైనా బలాన్నీ బలహినతనూ గుర్తించిన భారత ప్రధాని నరేంద్రమోదీ ఆదేశం వెళ్ళి పెట్టుబడులకు భారతదేశంలోగల అవకాశాలను వివరించి వచ్చారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు చైనా పర్యటనలు చేశారు. కెసిఆర్ నాలుగురోజులుగా చైనాలో పర్యటనలో వున్నారు.
అవకాశాన్ని వినియోగించుకోవడం ఎంత అవసరమో ఎదుటివారి సమస్యలనుంచి పాఠాలు నేర్చుకోవడం కూడా అంతకంటే ముఖ్యం. మౌలిక వసతుల కల్పనకు మితి మీరి ఖర్చు చేయడమే చైనా ఆర్ధిక సమస్యలకు మూలమని నరేంద్రమోదీ, చంద్రబాబు నాయుడు, చంద్రశేఖరరావు గ్రహించడం మన ప్రయోజనాలకు అత్యవసరం.