ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అభ్యర్థిత్వంపై అనేక రకాల వ్యాఖ్యలు వచ్చాయి. అదేదో తెలుగువారికి దక్కిన గొప్ప అవకాశంగా పేజీలకు పేజీలు రాసిన తెలుగు పత్రికల మాట ఎలా వున్నా జాతీయ మీడియా మాత్రం ఇందులో మరో కోణాన్ని సూటిగానే వెల్లడించింది. అంత సీనియారిటీ వున్న నాయకుణ్ని, అంత పెద్ద పదవిలోకి అయిష్టత చెప్పినా తీసుకోవడం దేశంలో ఇదే మొదటి సారి కావచ్చు. బిజెపి అద్యక్షుడు అమిత్ షా కూడా వెంకయ్యకు బాగా జూనియరే. ఆయనే ఉపరాష్ట్రపతి పదవికి ఒప్పించారు. అంతేగాక ఒక షరతు కూడా పెట్టారు. మీకు ఈ పదవి ఇష్టం లేదని నాతో చెప్పారు గాని ప్రధాని మోడీ అడిగినప్పుడు ఆ మాట చెప్పకండి అని. అక్కడ కూడా కాదంటే మొత్తంగా పక్కన పెట్టేస్తారన్న సూచన ఇందులో స్పష్టం. నిజంగా ఆయనకు ఇష్టంలేకపోతే అక్కడ చెప్పి తప్పుకొని వుండొచ్చు. కాని దానివల్ల తర్వాతి పరిస్థితి ఏమిటన్నది అస్పష్టంగా వుంటుంది గనకే పెద్దాయన ఒప్పేసుకున్నారు.
ఇక దీనిపై తెలుగు రాష్ట్రాల బిజెపిలో పెద్ద భాగం చాలా సంతోషంగా వున్నారు. ఇకనైనా తాము స్వేచ్ఛగా పనిచేసుకోగలమని బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఎపిలో ఇంతవరకూ పార్టీ అద్యక్షుడి ఎంపిక కూడా చేసుకోలేకపోవడానికి ఆయన ప్రభావమే కారణమని వారెప్పుడూ ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అసందర్భంగా పొగుడుతూ ఆ వ్యాపార వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేయడం వల్ల బిజెపి పెరగకుండా పోతుందని వారి ఫిర్యాదు. ఇక తెలంగాణలోనైతే కెసిఆర్ ప్రభుత్వంతో మంచిగా వుండటం ఏకైక సూత్రంగా వెంకయ్య జోక్యం చాలా మంది బిజెపి నేతలకు నచ్చదు. ప్రస్తుత రాష్ట్ర అద్యక్షుడు డా.కె.లక్ష్మణ్‌కు ఆయన మనిషిగా పేరుంది గాని అనేక మందికి అయిష్టమే ఎక్కువ. ఇలాటి వారు కూడా చాలా సంతోషంగా వున్నారు. అయితే ఉపరాష్ట్రపతి పదవిలో వున్నా వెంకయ్య నాయుడు ఇంతకు ముందు వారి వలె చేతులు కట్టుకుని వుండరని, హుషారుగానే పనిచేస్తారని కొందరంటున్నారు. ఏం చేసినా ఒకసారి బిజెపికి రాజీనామా చేసి రాజ్యాంగ పదవిలోకి వెళుతున్నారు గనక ప్రత్యక్ష ప్రభావం మాత్రం వుండదని తేల్చిచెబుతున్నారు. ఇది చంద్రబాబుకు ఢిల్లీలో చాలా నష్టమనీ , మంత్రి సుజనా చౌదరి కూడా క్యేబినెట్‌లో కొంత ఇబ్బంది పడతారని మరో అంచనా.