ఒకే దేశం ఒకే జెండా నినాదానికి కర్ణాటక దూరంగా జరుగుతోంది. తనకంటూ ప్రత్యేకంగా ఒక జెండా ఉండాలని అనుకుంటోంది. ఇందుకోసం ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. తొమ్మిదిమందితో ఒక కమిటీని కూడా ఏర్పాటుచేసింది. 370 అధికరణం కింద ఇప్పటికే తనకంటూ ప్రత్యేక పతాకాన్ని జమ్మూ కాశ్మీర్ ఏర్పాటు చేసుకుంది. గడిచిన ఏడు దశాబ్దాలలో కాశ్మీర్ ప్రజలలో వేర్పాటువాదం ఎంతగా పెరిగిపోయిందో దేశమంతా చూస్తూనే ఉంది. ఇప్పుడు అదే పంథాను కాంగ్రెస్ కర్ణాటకలో అమల్లో పెట్టాలని యోచిస్తోంది. ప్రత్యేక జెండాను ఏర్పాటుచేసుకుని ఊరుకోకుండా మరో వేర్పాటు వాద ఉద్యమానికి శ్రీకారం చుట్టదని నమ్మకం ఏమిటి? అసలే ఆ పార్టీ విభజించి పాలించు సిద్ధాంతాన్ని నరనరానా ఒంటబట్టించుకున్న పార్టీ. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక జెండా ఏర్పాటుచేసుకునేందుకు చట్టం అంగీకరించదు. సుప్రీం కోర్టు కూడా దీన్నే స్పష్టంచేస్తోంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటకనే. భారతీయ జనతాపార్టీని దెబ్బకొట్టడానికి కాంగ్రెస్ ఈ దొంగదారిని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే తమిళులు తాము భారతీయులమని అంగీకరించరు. తొలుత, తాము తమిళులమనీ, ఆ తరవాతే ఏదైనా అని అంటారు. అంతెందుకు ఆ రాష్ట్రంలోని ముస్లిం సోదరులు కూడా హిందీ మాట్లాడారు. తమిళమే మాట్లాడతారు. అయినప్పటికీ తమిళులు ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు. శ్రీలంక తమిళుల అంశంలో వారి భావజాలం వారికుంది.
భాషాభిమానం ప్రాంతీయాభిమానం ఉండటం మంచిదే. అది ఎప్పుడూ హద్దులు మీరకూడదు. కర్ణాటకలో కాంగ్రెస్ చేస్తున్నదదే. కాశ్మీర్లో పరిస్థితి జవహర్ లాల్ నెహ్రూ సాగించిన సంకుచిత రాజకీయాల పుణ్యఫలమే. అక్కడెంత హింస జరుగుతున్నా ప్రభుత్వాలు కళ్ళప్పగించి చూశాయి ఇంతవరకు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక పరిస్థితిని చక్కదిద్దడానికి శాయశక్తులా కృషి చేస్తోంది. అప్పటికే వేళ్ళూనుకున్న దేశ వ్యతిరేక శక్తులు కేంద్రానికి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నాయి.
ఇక కర్ణాటక రాష్ట్రానికి వస్తే.. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు మూఢనమ్మకాలు ఎక్కువ. కాకి వాలిందని కారు మార్చేసిన ఘనుడాయన. ఎవరో జ్యోతిష్యుడు చెప్పాడని కొన్నాళ్ళపాటు ఎడమచేత నిమ్మకాయ పట్టుకుని దర్శనమిచ్చిన మూర్ఖుడు కూడాను. ఇప్పుడు కాంగ్రెస్ తన పాచిక పారేందుకు సిద్దరామయ్యనే లక్ష్యంగా చేసుకుంది. కర్ణాటకకు ప్రత్యేక జెండాను రూపొందింపజేస్తే.. బద్ధవైరమున్న తమిళనాడును కూడా రెచ్చగొట్టినట్టవుతుందని ప్రణాళిక రచించినట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా దేశ సమైక్యతను దెబ్బతీసేందు కుట్ర కూడా ఇందులో కనిపిస్తోంది. కాశ్మీర్ అంటే ప్రత్యేక పరిస్థితులు కాబట్టి, కేంద్రం రాజీపడింది. దేశానికి పట్టుగొమ్మలాంటి దక్షిణాదిలో ఇలాంటి విపరీత పోకడలను.. అందునా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎన్డీఏ ప్రభుత్వం సహిస్తుందనుకోవడం పొరపాటే.
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి