పూరీ జగన్నాథ్‌ను విచారిస్తున్న తీరు డ్రగ్స్ కేసులో నోటీసులందుకున్న వారి గుండెల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి. వీఐపీలుగా పరిగణిస్తామనీ.. అరెస్టు చేయబోమనీ సిట్ హామీ ఇచ్చినట్లు ప్రచారమవుతున్నప్పటికీ పరిస్థితి చూస్తే అలా కనిపించడం లేదు. పూరీ జగన్నాథ్‌ను సిట్ ఫిక్స్ చేసినట్లే కనిపిస్తోంది. ఉదయం 10.30 గంటల నుంచి విచారించిన అధికారులు సాయంత్రం అయ్యేటప్పటికి రక్త నమూనా సేకరణ కోసం ఉస్మానియా నుంచి ఓ సర్జన్‌ను రప్పించారు. అనంతరం నార్కొటిక్స్ విభాగం అధికారులనూ పిలిపించారు. పూరీ జగన్నాథ్ తన సినిమాలో ఇంతవరకూ చూపించిన క్రైం సన్నివేశాలనూ, విచారణ ఘట్టాలను స్వయంగా చూడాల్సి రావడం విచారకరం. తన సినిమాలతో ప్రేక్షకులను అలరించానని భావిస్తున్న ఆయన తనకు ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని ఊహించి ఉండరు. అరెస్టు చేయబోరనే హామీతో ఆయన ధీమాగా విచారణకు హాజరైనట్లు తెలిసింది. సిట్ కార్యాలయంలోకి అడుగుపెడుతున్న సమయంలో ఆయన ముఖ కవళికలు నిర్వికారంగా కనిపించాయి. వాటి మాటున ఆందోళనను అణిచిపెట్టుకున్నట్లు అనిపించింది. ఆయనతో పాటు వచ్చిన కుమారుడు ఆకాశ్, తమ్ముడు సాయి శంకర్లు సిట్ కార్యాలయం బయట అభిమానులతో సెల్ఫీలు తీసుకుంటూ కనిపించారు.
మీడియాలో మాత్రం పూరీని అడిగిన ప్రశ్నలూ-సమాధానాలంటూ ప్రసారం చేసి, వీక్షకుల్లోనూ, టాలీవుడ్‌లోనూ ప్రెజర్ పెంచేశారు. సినీ లోకంతో పాటు అభిమానులు సైతం ఉత్కంఠగా గడిపారు. పూరీ ప్రస్తుతం బాలకృష్ణ 101వ సినిమా పైసా వసూల్ ను చిత్రీకరిస్తున్నారు. ఒకవేళ పూరీ అరెస్టయితే.. ఎప్పుడు విడుదలవుతారు.. బెయిలు వెంటనే ఇస్తారా? ఇవ్వకపోతే.. సినిమా షూటింగ్ అర్ధంతరంగా నిలిచిపోతుంది. అన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే సెన్సేషనల్ ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అకున్ సబర్వాల్ బయటకు రావాల్సిందే. అంతకు ముందే, పూరీని అరెస్టు చేయడం లేదని ఎక్సయిజ్ అధికారులు ప్రకటించడం ఆయనకు ఊరటే…
-సుబ్రహ్మణ్యం విఎస్ కూచిమంచి