నంద్యాల ఉప ఎన్నికను అధికార ప్రతిపక్షాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం ఎవరి స్థాయిలో వారు వ్యూహ ప్రతివ్యూహాలతో ఉన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రమేయం ఉండకూడదు అని అందరూ చెబుతుంటారు! ఈ మధ్య చంద్రబాబు కూడా అదే మాట చెప్పారు. ఎన్నికలప్పుడు ఇచ్చే రూ. 500, రూ. 1000 కోసం ఆశ పడొద్దూ, ప్రభుత్వం ప్రతీనెలా పింఛెన్లు, ఇతర ప్రయోజనాలు ఇస్తోందన్నట్టుగా చెప్పినమాట ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి. అంతేకాదు, ఎన్నికల్లో ధన ప్రవాహానికి అడ్డుకట్ట వెయ్యాలని కూడా నీతులు వల్లె వేశారు. అయితే, వాస్తవంలో నంద్యాలలో జరుగుతున్నదీ… జరగబోయేది కూడా ధన ప్రవాహమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందులో ప్రతిపక్షానికి కూడా ఎలాంటి మినహాయింపు లేదు!
నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో జరుగుతున్న అధికారిక ఖర్చుల గురించి చెప్పాలంటే.. చేతికి ఎములేనట్టుగా టీడీపీ సర్కారు వివిధ అభివృద్ధి పథకాల పేరుతో నిధులు గుమ్మరిస్తోంది. దాదాపు రూ. 500 కోట్ల వరకూ నియోజక వర్గ అభివృద్ధి కోసం టీడీపీ కేటాయించినట్టు కొన్ని లెక్కలు చక్కర్లు కొడుతున్నాయి. ఇక, అనధికారిక లెక్కల గురించి మాట్లాడుకుందాం! ఓట్ మేనేజ్ మెంటు కోసం అధికార పార్టీ రూ. 40 కోట్లు వరకూ ఖర్చు పెట్టబోతోందంటూ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గ్రామస్థాయి నుంచీ ఓ సర్వే చేయించుకుని, దాని ఆధారంగా ప్రచారానికి ఎంత ఖర్చు పెట్టాలీ, ఓటర్లు కోసం ఎంత ఖర్చు చేయ్యాలనే అనే ప్లానింగ్ తో అధికార పార్టీ ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.
ఇక, ప్రతిపక్షం కూడా ఏమాత్రం తగ్గడం లేదట. అయితే, నిధుల విషయంలో అధికార పార్టీకి ఉన్నంత సర్దుబాటు వైసీపీకి ఉండదు. నిజానికి, నంద్యాల ఎన్నికల ఖర్చు విషయంలో శిల్పా మోహన్ రెడ్డితో మొదటే ఒక డీల్ కుదుర్చుకున్నట్టు కథనాలు వచ్చాయి. ఎన్నికల ఖర్చంతా తానే పెట్టుకుంటాననీ, వైసీపీ నుంచి టిక్కెట్టు ఇస్తే చాలనే ఎగ్రిమెంట్ తోనే ఆయన పార్టీ మారినట్టు చెప్పుకున్నారు. దీంతో ఎన్నికల ఖర్చంతా ఆయన ఒక్కరి భుజస్కందాలపైనే ఉందని అంటున్నారు. అయితే, అధికార పార్టీతో పోటీ పడే స్థాయిలో నిధుల సమీకరణకు శిల్పా కూడా కాస్త తటపటాయిస్తున్నట్టుగానే తెలుస్తోంది. ప్రస్తుతం నంద్యాల ఉప ఎన్నికకు వైకాపా పెట్టుకున్న బడ్జెట్ రూ. 30 కోట్లు అని ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సొమ్ము పంపిణీ విషయంలో పోలీసుల నుంచి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనీ, ఇప్పటికే పలువురు నాయకులపై డేగకన్నేసి ఉంచారనీ ఆ పార్టీ వర్గాల్లోనే వినిపిస్తోంది!
మరి, డబ్బుల లెక్కలు ఇంత బహిరంగంగా వినిపిస్తూ ఉంటే ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ ధన ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి కఠిన చర్యలు చేపట్టనుందో కూడా చూడాల్సిందే. మొత్తానికి, నంద్యాల ఎన్నికల అత్యంత ఖరీదైన ఉప ఎన్నిక కాబోతున్నట్టుగా ఉంది!