డ్రగ్స్ వ్యవహారం చుట్టి ముట్టిన తరవాత.. పూరి తొలిసారి నోరు విప్పాడు. తన ట్విట్టర్లో ఓ వీడియో పోస్ట్ చేశాడు. రెండు నిమిషాల ఆ వీడియోలో పూరి తాలుకూ మనో వేదన అర్థం అవుతోంది. డ్రగ్స్ వ్యవహారంలో ఇరుక్కున్నానన్న బాధ కంటే.. మీడియా చేసిన `అతి` పూరిని ఇంకా బాధించింది. `మీ వల్ల జీవితాలు నాశనం అయ్యాయి` అనే రేంజులో పూరి స్పందించాల్సివచ్చిందంటే.. ఈ విషయంలో ఎంత హర్ట్ అయ్యాడో అర్థం చేసుకోవొచ్చు. పూరి తాలుకూ లైఫ్ స్టైల్ మీడియాకు తెలియంది కాదు. జీవితాన్ని ఎంజాయ్ చేయడంలో పూరి తరవాతే ఎవరైనా అనే సంగతి అందరికీ తెలుసు. బ్యాంకాక్ వెళ్లేది.. కథల కోసమా, తన సరదాల కోసమా?? అనేది ఇప్పుడు విడమర్చి చెప్పే అవసరం లేదు. డ్రగ్స్ వ్యవహారం.. పూరి జీవితంలో మాయని మచ్చ. అందులో నిజమెంత?? నిజంగానే పూరి ఈ విషయంలో పీకల్లోతు కూరుకు పోయాడా? అనేది తరువాతి సంగతి. ఇప్పటికైతే చాలా డామేజ్ జరిగిపోయింది.
ఈ వారం రోజులూ… డ్రగ్స్ తప్ప మరో వ్యవహారం ప్రపంచంలోనే జరగడం లేదన్నట్టుగా మీడియా కవరేజులు ఇచ్చింది. పూరి ఇలాంటి వాడే అంటూ ముద్ర వేసేసింది. ఏ విషయంలో అయినా ఆచి తూచి స్పందించి. కాస్త నర్మ గర్భంగా వార్తలు రాసే మీడియా… ఈ విషయంలో మాత్రం విజృంభించి… ఆ 12 మందే డ్రగ్స్ మాఫియా అన్న రేంజులో వార్తలు , కథనాలు ప్రసారం చేసింది. ఈ టీమ్ లీడర్ పూరినే అన్నట్టు… కవరేజీలు ఇచ్చింది. ఆఖరికి సిట్ విచారణకు పూరి హాజరయ్యే తతంగం `లైవ్`లో చూపిస్తూ… అతన్ని అంతర్జాతీయ నేరస్థుడన్న రేంజులో టీవీలో చూపించింది. ఇవన్నీ పూరిని బాధించి ఉంటాయి. అందుకే అలా బయటపడిపోయాడు. సినిమా వాళ్లు అనగానే విజృంభించే మీడియా.. రేపు రాజకీయ నాయకుల వారసుల విషయంలోనూ ఇంతే ఘాటుగా స్పందింస్తే.. బాగుంటుంది.